బాహుబలి సినిమాతో టాలీవుడ్ జనాలకే కాదు బాలీవుడ్ జనాలకు సైతం మన డార్లింగ్ ప్రభాస్ తెగనచ్చేశాడు. అక్కడి స్టార్ హీరోలతో సమానంగా పాపులారిటీ దక్కించుకున్నాడు. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రభాస్ హీరోగా సాహో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్నఈ చిత్రానికి సుజిత్ దర్శకుడు.అయితే ప్రభాస్‌కి జోడీగా ఈ సినిమాతో బాలీవుడ్ కథానాయిక శ్రద్ధా కపూర్ తెలుగు తెరకి పరిచయం అవుతోంది.
రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా టాలీవుడ్ లో ప్రవేశించిన ప్రభాస్ ఇప్పటి వరకు 16 సినిమాలు చేశాడన్న సంగతి తెలిసిందే. తాజాగా ‘సాహో’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడీ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్న బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్, ప్రభాస్ గురించి ఒక్కో విశేషం చెబుతూ ఆసక్తి పెంచుతోంది. తొలుత ప్రభాస్ ఆతిథ్యం గురించి చెప్పిన శ్రద్ధా, తాజాగా ప్రభాస్ కు కొత్త బిరుదు కూడా ఇచ్చింది.
ఈసినిమా షూటింగ్ సందర్భంగా యూనిట్ తో మాట్లాడుతూ, ప్రభాస్ నటించిన అన్ని సినిమాలను చూసేశానని చెప్పింది. ప్రభాస్ నటన గురించి తెలుసుకునేందుకే అతని సినిమాలు చూశానని అంది. ప్రభాస్ ను అంతా యంగ్ రెబల్ స్టార్ అంటారని, కానీ ప్రభాస్ ను అలా కాకుండా ‘ద న్యూ బ్లాక్ బస్టర్ కింగ్’ అని పేర్కొంది. ఇలా యంగ్ రెబల్ స్టార్‌ని ద న్యూ బ్లాక్ బస్టర్ కింగ్‌ని చేసింది శ్రద్దాకపూర్.