మాల్ కల్చర్… అన్నీ దొరకుతాయిక్కడ..

325
shopping-mall
- Advertisement -

షాపింగ్‌ మాల్‌.. అదో గమ్మత్తైన షాపింగ్‌ ప్రపంచం. మరో లోకంలో విహారం. ఒక్కసారి లోపలికెళితే బయటికి రావడానికి ఓ పట్టాన మనసొప్పదు. సెంట్రలైడ్జ్‌ ఏసీ, కళ్లు చెదిరే అలంకరణలు, రకరకాల వస్తువులు, వాటి మీద దిమ్మతిరిగే ఆఫర్లు. అక్కడికక్కడే ఆక్షన్‌ సేల్స్.. తిన్నవాళ్లకు తిన్నంతా.. తాగినవాళ్లకు తాగినంత.. అక్కడే ఆడి.. పాడి ఎంచక్కా ఓ సినిమా చూసి షికారు చేసి వచ్చేంత వెసులుబాటు. ఆ మరో లోకం పేరే మాల్‌.

 Shopping-Mall_

నగరాల్లో ప్రజల దైనందిన జీవితాల్లో షాపింగ్‌ మాల్స్‌ ఓ భాగమైపోయాయి. పెరుగుతున్న నగరాల అభివృద్దితో పాటు ప్రజల అభిరుచుల్లో కూడా మార్పులు వస్తున్నాయి. షాపింగ్ కి వెళ్లాలనుకుంటే మాత్రం మాల్స్ కి వెళ్లడానికే జనం ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అన్ని వస్తువులు ఒకే చోట దొరకడంతో పాటు ఫన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ కూడా ఉండటంతో మాల్స్ కి క్యూ కడుతున్నారు. హైదరాబాద్‌లో ఒకప్పుడు సామాన్య జనం షాపింగ్‌ అంటే అమీర్ పేటనో, కోఠికో వెళ్లి షాపింగ్‌ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది. ఏ వస్తువు కొనాలన్నా షాపింగ్‌ మాల్‌కు వెళ్తున్నారు. పిల్లలకు కావాల్సిన గేమింగ్‌.. ఆడవాళ్లకు కావాల్సిన ఆర్టికల్స్‌.. మగవాళ్లకు అవసరమయ్యే ఐటమ్స్‌.. పెద్దవాళ్లకు కావాల్సిన వస్తువులు.. ఒకటా.. రెండా.. ఇంటిల్లిపాదికి అవసరమయ్యే అన్ని వస్తువులు ఒకే చోట దొరకడం వల్ల షాపింగ్‌ మాల్స్‌ అంత క్రేజ్‌. డబ్బులు ఉండాలే కానీ మాల్‌ లో దొరకనిది అంటూ ఉండదు.

 Shopping-Mall_

మాల్స్ కి వెళ్లేవారి సంఖ్య రోజురోజుకీ పెరగడంతో సిటీతో పాటు నగర శివార్లలో కొత్త కొత్త మాల్స్ పుట్టుకొస్తున్నాయి. మెట్రోరైలు వచ్చిన తర్వాత మెట్రో మాల్స్ కూడా అందుబాటలోకి వచ్చాయి. ఇప్పటికే పంజాగుట్ట, హైటెక్ సిటీలో మెట్రో మాల్స్ ఓపెన్ అయ్యాయి. ఒకే చోట అన్ని దొరుకుంతుండటంతో మాల్స్ కి వెళ్లడానికే ఇష్టపడుతామంటున్నారు జనం. ఫ్యామిలీతో బయటకొస్తే షాపింగ్ ఒకచోట, రెస్టారెంట్ మరోచోట కాకుండా… అన్నీ మాల్స్ లోనే ఉండటంతో ఇక్కడికే వస్తున్నామని చెబుతున్నారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో వస్తే షాపింగ్, సినిమాతో ఎంజాయ్ చేసి వెళ్లొచ్చంటున్నారు. మొత్తానికి షాపింగ్‌ మాల్స్‌ నగర ప్రజానీకానికి దగ్గరయ్యాయి. ముందు ముందు షాపింగ్‌ మాల్స్‌ ఎటువంటి ట్రెండ్‌ను సృష్టిస్తాయో చూడాలి.

- Advertisement -