అమెరికాలోని మిన్నియాపోలీస్ నగరంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. యూఎస్ ఇమ్మిగ్రేషన్ విభాగానికి చెందిన ఓ అధికారి జరిపిన కాల్పుల్లో రెనీ నికోల్ గుడ్ (37) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
అధికారిక సమాచారం ప్రకారం, రెనీ నికోల్ గుడ్ తన కారులో ప్రయాణిస్తుండగా యూఎస్ ఇమ్మిగ్రేషన్ అధికారి కాల్పులు జరిపాడు. గాయాల తీవ్రత కారణంగా ఆమెను రక్షించేలోపే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ప్రాంతాన్ని దిగ్బంధనం చేశారు.
ఆ సమయంలో యూఎస్ ఇమ్మిగ్రేషన్ అధికారులు మిన్నియాపోలీస్‌లో అక్రమ వలసదారులపై సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ విషాదకర ఘటన చోటు చేసుకున్నట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే కాల్పులు జరపాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు అమెరికా అధికారులు తెలిపారు. కాల్పులు జరిపిన అధికారిని విధుల నుంచి తాత్కాలికంగా తప్పించి, విచారణ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. మృతురాలి కుటుంబ సభ్యులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటన అమెరికాలో ఇమ్మిగ్రేషన్ సోదాల సమయంలో జరుగుతున్న భద్రతా చర్యలపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది. స్థానిక ప్రజలు, మానవ హక్కుల సంఘాలు ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, పూర్తి స్థాయి విచారణ జరపాలని కోరుతున్నాయి.
Also Read:Nani:ది ప్యారడైజ్..ఫస్ట్ సింగిల్!

