హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ‘అర్జున్ రెడ్డి’. ఈ నెల 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాగురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం తెలుస్తోంది. ఈ సినిమా నిడివి 3 గంటలకు పైగా ఉంటుందట. ఒకప్పుడు తెలుగు సినిమాల నిడివి రెండున్నర గంటలుండేది. కొన్ని సినిమా మూడు గంటల లెంగ్త్ కూడా ఉండేవి. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితి మారింది.
ఈ మధ్య టాలీవుడ్ సినిమాల లెంగ్త్ రెండు-రెండుంబావు గంటలకు అటు ఇటుగా ఉంటోంది. బాహుబలి లాంటి సినిమాలు మినహాయిస్తే రెండున్నర గంటలకు పైగా నిడివి ఉన్న సినిమాలతో ప్రేక్షకులు ఇబ్బంది పడిపోతున్నారు. ఇదిలా ఉండగా ..పొడుగాటి ట్రయిలర్ విడుదల చేసి తమ ధైర్యాన్ని చాటుకున్న ‘అర్జున్ రెడ్డి’ మేకర్స్.. ఇప్పుడు మూవీ రన్ టైం విషయంలో కూడా అదే ధైర్యం, తెగువ చూపిస్తున్నారు.
అవును.. అర్జున్ రెడ్డి సినిమా నిడివి 3 గంటల 10 నిమిషాలట. ఇంత నిడివితో సినిమాను విడుదల చేసేందుకు స్టార్ హీరోలు కూడా భయపడతారు. కానీ అర్జున్ రెడ్డి మాత్రం తగ్గట్లేదు. మరోవైపు సెన్సార్ విషయంలో కూడా అదే తెగువ చూపించింది చిత్ర టీమ్. సూచించిన కట్స్ తొలిగిస్తే సినిమాకు యు/ఎ సర్టిఫికేట్ ఇస్తామన్నారట సెన్సార్ సభ్యులు. కానీ సినిమా యూనిట్ మాత్రం ఒప్పుకోలేదట. ఎ-సర్టిఫికేట్ తోనే రిలీజ్ కు వెళ్ళడానికి రెడీ అయిపోతున్నారు. మరోవైపు సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్న మేకర్స్.. రిలీజ్ కు ఒక రోజు ముందు నుంచే ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేస్తున్నారట.