రేప్ కేసులో డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ బాబాకి ఇటీవలే సీబీఐ కోర్టు జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, తనను తాను దైవస్వరూపిణిగా ప్రకటించుకున్న రాధేమాకు కూడా జైలు కూడు తప్పేలా లేదు. తాజాగా రాధేమా మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని పంజాబ్, హర్యానా హైకోర్టు పంజాబ్ పోలీసులను ఆదేశించింది. తనను ఆమె అదేపనిగా వేధిస్తూ బెదిరిస్తోందని విశ్వహిందూ పరిషద్ మాజీ అధ్యక్షుడు సురేందర్ మిట్టల్ దాఖలు చేసిన ఫిర్యాదును పురస్కరించుకుని కోర్టు ఈ మేరకు పోలీసులను ఆదేశించింది.
రాధేమా బాధితుడు సురీందర్ మాట్లాడుతూ.. ఆమె మొదట మంచి మాటలు చెబుతూ పరిచయం చేసుకుంటుందని, తర్వాత మోహపువల విసిరి, చివరికి చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతోందని చెప్పారు. తనపై ఆమె ఇలాగే ప్రవర్తించిందని, వాటికి సంబంధించిన ఫోన్ రికార్డింగ్స్‌ను కోర్టుకు అందించానని తెలిపారు. ఈ నేపథ్యంలోనే కోర్టు ఆమెపై కేసు నమోదు చేయాలని ఆదేశించిందని అన్నారు. అంతేగాక, సత్సంగ్ పేరుతో రాధేమా నగ్న పూజలు నిర్వహించేదని చెప్పారు. గతనెల 23న అన్ని ఆధారాలతో సురీందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తాను కంప్లైంటు చేసినప్పటికీ పోలీసులు ఆమె మీద ఎలాంటి చర్యలూ తీసుకోలేదంటూ మిట్టల్ కోర్టుకు విన్నవించుకున్నారు. గతంలో తనకు, ఆమెకు మధ్య జరిగిన సంభాషణను రికార్డు చేసిన క్లిప్పింగులను ఆయన ఆ మధ్య వివిధ ఛానెల్స్ కు అందజేశాడు. 2015 లో ఈ క్లిప్పింగ్స్ ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి.
ఒకప్పుడు సాధారణ భక్తురాలయిన రాధేమా… అసలు పేరు సుఖ్వీందర్ కౌర్. ఆమె 15 ఏళ్ల క్రితం పంజాబ్‌లోని ఫడ్వాడా పట్టణంలో ఒక జాగరణ నిర్వహించి, తనను తాను దుర్గామాత అవతారంగా ప్రకటించుకున్నారు. డబ్బుల కోసం డిమాండ్ చేయడం, బెదిరింపులు, వరకట్న వేధింపులు మొదలైన నేరాలతో కేసులు ఎదుర్కొంది రాధేమా.తనను ఆమె తీవ్రంగా వేధించిందని, వరకట్నం కేసులో తనను తన భర్త హింసించేలా ఆమె రెచ్చగొట్టిందని నటి డాలీ బింద్రా అప్పట్లో రాధేమా మీద క్రిమినల్ కేసు దాఖలు చేసింది. తనను తాను అపర కాళీగా ప్రకటించుకున్న ఈ కామదేవతను అమాయక జనాలు మాత్రం ఇంకా దేవతగా ఆరాధిస్తుండడం విచిత్రం. సోషల్ మీడియాలోనూ రాధేమాకు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఆమెకు వ్యతిరేకంగా ఒక్క కామెంట్ పెట్టినా దాన్ని ఖండిస్తూ పోస్టులు పెడతారు.