వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మెజారిటీ వస్తే ఎమ్మెల్యేలే సీఎంను ఎన్నుకుంటారని ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఇటీవల ప్రకటించారు.దీంతో అఖిలేష్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. తండ్రి ములాయం తీరును తప్పు బట్టారు. మరోవైపు బాబాయ్ శివపాల్‌తో అబ్బాయి అఖిలేష్ విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ ఉదయం వంద మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎమ్మెల్సీలతో సమావేశమైన సీఎం అఖిలేష్ ఊహించని నిర్ణయాలు తీసుకున్నారు. తండ్రి ములాయంకు ప్రీతిపాత్రుడైన సోదరుడు శివపాల్ యాదవ్ సహా నలుగురిని మంత్రివర్గం నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు.
తొలగించబడ్డ మంత్రుల్లో సీనియర్ నేత ఓపీ సింగ్ కూడా ఉన్నారు. ఇదిలావుండగా, సీఎంగా అఖిలేష్ ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి వుంటానని పార్టీ జనరల్ సెక్రటరీ, మరో ములాయం సోదరుడు రామ్ గోపాల్ యాదవ్ ప్రకటించారు.
దీంతో యాదవ్ పరివారంలో కొద్దిరోజులుగా సాగుతోన్న అంతర్గత కలహాలు పతాకస్థాయికి చేరినట్లయింది. అఖిలేష్ నిర్ణయంతో సమాజ్‌వాదీ పార్టీలోని మరో వర్గం భగ్గుమంది. మరో ఏడాదిలో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఏ పరిణామాలకు దారితీస్తుందోనని ఆపార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. మంత్రి వర్గం నుండి తనను తొలిగించిన వెంటనే శివపాల్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్‌తో సమావేశమయ్యారు.