జాలీ రైడ్‌కు వెళ్లినట్టుగా అయలాన్

37
- Advertisement -

శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘అయలాన్’. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ఆర్. రవికుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని కెజెఆర్ స్టూడియోస్ పతాకంపై కోటపాడి జె. రాజేష్ నిర్మించగా… ఆస్కార్ పురస్కార గ్రహీత, లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. ఈ నెల 12న సంక్రాంతి కానుకగా తమిళనాడులో విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 26న గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ద్వారా మహేశ్వర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. సినిమా విడుదల సందర్భంగా తెలుగు మీడియాతో శివకార్తికేయన్ ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు…

ఏలియన్ ఇద్దరు హీరోల సినిమా అని తమిళనాడులో చెప్పారు. ఎందుకు?
అవును… ‘అయలాన్’ సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నారు. నేను ఓ హీరో అయితే‌… మరొక హీరో ఏలియన్.

హీరోగా మీ కెరీర్ చూస్తే ఎక్కువ రోజులు పట్టిన సినిమా ఇదే. దీనిని తప్పకుండా చేయాలని ఫిక్స్ అవ్వడానికి కారణం ఏమిటి?
దర్శకుడు రవికుమార్ విజన్. ‘అయలాన్’ సినిమాలో 4500 వి.ఎఫ్.ఎక్స్ షాట్స్ ఉన్నాయి. రోబో, 2.ఓ సినిమాల్లో కంటే ఎక్కువ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న చిత్రం ఇది. మా బడ్జెట్ తక్కువ. పరిమిత నిర్మాణ వ్యయంలో గనుక సినిమా తీయగలిగితే మరింత పెద్ద కలలు కనవచ్చు అని అనిపించింది. అందుకే ఎక్కువ రోజులు పట్టిన తప్పకుండా ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను.

మేకింగ్ కోసం ఎక్కువ రోజులు పడితే… ఐడియా లీక్ కావచ్చు. వేరే హీరో, దర్శక – నిర్మాతలు ఈ తరహా కథతో సినిమా తీయవచ్చు. ఈ డౌట్స్ మీకు వచ్చాయా?
చిన్న చిన్న సందేహాలు అయితే ఉన్నాయి. నేను హాలీవుడ్ సినిమా పేరు చెప్పను కానీ… మేము తీసిన సన్నివేశం ఆ తర్వాత విడుదలైన ఓ సినిమాలో ఉంది. ఫాంటసీ సూపర్ హీరో ఫిలిం కాబట్టి కొన్ని కొన్ని సన్నివేశాలు మనం ముందు తీసినప్పటికీ… తర్వాత విడుదలైన కొన్ని సినిమాల్లో ఉండొచ్చు. అయితే… ఏలియన్ – మనిషి మధ్య సన్నివేశాలు, వాళ్ళిద్దరి ఇంటరాక్షన్, అయలాన్ కోర్ పాయింట్ మీద ఇప్పటివరకు సినిమా రాలేదు. మా స్క్రిప్ట్ ఐడియా ఇప్పటికీ కొత్తగా ఉంది. ఒకవేళ మా దర్శకుడు కనక ఇప్పుడు స్క్రిప్ట్ రాస్తే స్క్రీన్ ప్లే మార్పులు ఏమైనా చేస్తాడేమో. తమిళనాడులో సినిమా చూసిన వాళ్ళు ఎవరు కథపై కంప్లైంట్స్ చేయలేదు. చాలా కొత్తగా ఉందని చెప్పారు. అది మా అదృష్టం.

అయలాన్ తమిళ సినిమా.‌ తెలుగులోనూ విడుదల చేస్తున్నారు కాబట్టి నేటివిటీ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
యూనివర్సల్ కాన్సెప్ట్ ఉన్న చిత్రమిది. హ్యూమన్ ఏలియన్ మధ్య ఇంటరాక్షన్ అన్ని ప్రాంతాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. మా సినిమా తమిళనాడులో భారీ విజయం సాధించింది. తెలుగులో కూడా సూపర్ హిట్ అవుతుందని నమ్మకం ఉంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మా ప్రయత్నాన్ని అభినందిస్తారని చెప్పగలను.

తమిళనాడులో సంక్రాంతికి సినిమా విడుదలైంది. తెలుగులో రెండు వారాలు ఆలస్యంగా వస్తోంది. దీనిపై మీరు ఫీలింగ్?
సంక్రాంతికి తెలుగులో చాలా సినిమాలు ఉండటంతో విడుదల మా సినిమాను విడుదల చేయలేదు. రెండు వారాలు ఆలస్యంగా వచ్చినా విజయం సాధిస్తుందని నమ్మాను. ‘లవ్ టుడే’, ‘విడుదలై’, విశాల్ ‘అభిమన్యుడు’ సినిమాలు తమిళంలో విడుదలైన తర్వాత తెలుగులో విడుదలై హిట్ అయ్యాయి. కంటెంట్ బావుంటే ఆడుతుంది. సినిమా కోసం ఐదేళ్లు వెయిట్ చేశా. రెండు వారాలు పెద్ద సమస్య కాదు.

ఐదేళ్ల మేకింగ్ టైంలో మిమ్మల్ని మోటివేట్ చేసిన అంశం ఏమిటి?
200, 300 కోట్ల బడ్జెట్ ఉంటే తప్ప ఇటువంటి సినిమా చేయలేమని చెబుతారు. సరైన టీమ్, ఐడియా ఉంటే తక్కువ బడ్జెట్ లో కూడా చేయవచ్చు. ఇది హిట్ అయితే ఎక్కువ బడ్జెట్ ఇవ్వడానికి నిర్మాతలు ముందుకు వస్తారు. అప్పుడు మేం ఇంకా పెద్ద కల కనొచ్చు. మమ్మల్ని మోటివేట్ చేసిన అంశం అదే.

సినిమాలో గ్రాఫిక్స్ పార్ట్ నిడివి ఎంత?
‘అయలాన్’లో 90 శాతం సన్నివేశాల్లో గ్రాఫిక్స్ ఉన్నాయి. 70 శాతం సినిమాలో ఏలియన్ ఉంది. సో… మెజారిటీ సినిమా అంతా విజువల్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి.

లుక్స్ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
మేం కోవిడ్ కంటే ముందు సినిమా షూటింగ్ చేశాం. కరోనాలో ఆఫీసులు క్లోజ్ చేయడంతో విజువల్ ఎఫెక్ట్స్ చేయడం కుదరలేదు.

ముందు నుంచి రెహమాన్ గారిని సంగీత దర్శకుడిగా అనుకున్నారా?
అవును… రెహమాన్ గారి మ్యూజిక్ ఫిక్స్. ఆయనతో నా ఫస్ట్ సినిమా ఇది. నేను రెహమాన్ గారికి పెద్ద ఫ్యాన్. ఆయన నా సినిమాకు సంగీతం అందించాలనేది బిగ్గెస్ట్ డ్రీం. ఈ సినిమాతో రవికుమార్ ఐడియా కారణంగా అది కుదిరింది. ఆయన మాకు ఎంతో మోటివేషన్ ఇచ్చారు. లాస్ట్ సెకండ్ వరకు వర్క్ చేశారు. నేను ఇక్కడ ఇంకా బాగా చేయాల్సిందని రెహమాన్ చెప్పారు. తెలుగులో విడుదలకు రెండు వారాలు టైమ్ ఉండటంతో మ్యూజిక్ పరంగా కొన్ని ఇంప్రవైజేషన్స్ చేశారు.

రెహమాన్ గారితో డ్యాన్స్ చేయించినట్టు ఉన్నారు!
డ్యాన్స్ మాస్టర్ శాండీ వల్ల కుదిరింది. ‘మామన్నన్’ (తెలుగులో ‘నాయకుడు’గా విడుదలైన ఉదయనిధి స్టాలిన్, కీర్తీ సురేష్ సినిమా) ప్రమోషనల్ సాంగ్ కోసం చిన్న స్టెప్ వేశారు. మేం ఆయనతో రెండు గంటలు డ్యాన్స్ చేయించాం. ఆయన చాలా ఫాస్ట్. బహుశా… ముందు డ్యాన్సర్ ఏమో! రెండు గంటల్లో చేసేశారు.

‘అయలాన్’ గురించి ప్రేక్షకులకు ఏం చెబుతారు?
‘అయలాన్’ సినిమాలా ఉండదు… మీరు థీమ్ పార్క్ లోకి వెళ్లినట్టు ఉంటుంది. జాలీ రైడ్ కింద ఉంటుంది. రెండున్నర గంటలు హాయిగా చూసి తర్వాత మీ పని మీరు చేసుకోవచ్చు.

సీక్వెల్ ఐడియా ఉందా?
ఉంది. ఏలియన్ క్రియేట్ చేయడానికి మేం చాలా రీసెర్చ్ చేశాం. ఎక్కువ టైమ్ స్పెండ్ చేశాం. సీక్వెల్ ఐడియా మాకు ముందు నుంచి ఉంది. సీక్వెల్ ఇంకా బిగ్గర్ స్కేల్ లో చేస్తాం. తమిళనాడులో సక్సెస్ మమ్మల్ని మోటివేట్ చేసింది.

కమల్ హాసన్ నిర్మాణంలో ఒక సినిమా చేస్తున్నారు కదా! దాని గురించి…
ఆల్రెడీ 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేశాం. జానర్, సినిమా స్టైల్ గురించి ఇప్పుడు నేను చెప్పలేను. అందులో నేను, సాయి పల్లవి నటిస్తున్నాం. వేసవిలో విడుదల కావచ్చు.

Also Read:పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో `ముఖ్య‌గ‌మ‌నిక‌`

- Advertisement -