తనపై జరుగుతున్న విమర్శలు, ఫిర్యాదులపై నటుడు శివాజీ తీవ్ర భావోద్వేగంతో స్పందించారు. “నేను ఏం తప్పు చేశాను..? నాపై ఇంత ద్వేషం ఎందుకు?” అంటూ ప్రశ్నించారు. హీరోయిన్లకు తండ్రిలా కొన్ని సూచనలు మాత్రమే చేశానని, అందులో ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. ఎవరు ఎలాంటి బట్టలు వేసుకుంటే తనకేమీ సంబంధం లేదని, గతంలో ఇలాంటి మాటలు మాట్లాడిన వారిపై ఎవరైనా ఇలాగే కంప్లైంట్లు ఇచ్చారా? అని నిలదీశారు.
స్త్రీ లేకపోతే ఈ ప్రపంచమే లేదని, మానవాళి మనుగడే అసాధ్యమని శివాజీ అన్నారు. తాను ఎప్పుడూ స్త్రీని మహాలక్ష్మిలా చూడాలని అనుకుంటానని, మహిళల పట్ల గౌరవంతోనే మాట్లాడానని తెలిపారు. అయితే ఆవేశంలో రెండు పదాలు దొర్లితే, దాన్నే ఆధారంగా చేసుకుని తనపై ఇంత కుట్ర చేస్తున్నారా? అని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవస్థలను గౌరవించకపోతే సమాజం తప్పుడు దారిలో పడుతుందని హెచ్చరించారు. తాను మాట్లాడింది తప్పు అని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ తనకు ఒక బిడ్డకు చెప్పినట్టుగా చెప్పారని, ఆ మాటను గౌరవిస్తానని అన్నారు. కానీ వార్నింగ్ ఇస్తే భయపడే రకం తాను కాదని స్పష్టం చేశారు.
తాను బతుకుదెరువు కోసం ఈ రంగంలోకి వచ్చిన వాడినని, ఇక్కడ అవకాశం లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్లి బతుకుతానని, కానీ ఆత్మాభిమానం మాత్రం చంపుకోనని శివాజీ ఘాటుగా చెప్పారు. వ్యవస్థలను, పరిశ్రమను గౌరవించకుండా, విలువలు లేని బతుకు బతకడం తనకు ఇష్టమില്ലని, నిజాయితీతోనే ముందుకు సాగుతానని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు.
Also Read:కొత్తిమీరతో ప్రయోజనాలు..!

