చినజీయర్ స్వామి వ్యాఖ్యలపై దుమారం

4
- Advertisement -

ఆది శంకరాచార్యులపై చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలపై శివ పీఠాధిపతి శివస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల చినజీయర్ స్వామి, చతురామ్నాయ పీఠాలను ఆది శంకరాచార్యులు ఏర్పాటు చేయలేదని వ్యాఖ్యానించడం దేశవ్యాప్తంగా శైవ వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించిందన్నారు. ఈ వ్యాఖ్యలు ఆది శంకరాచార్యుల మహనీయతను కించపరచేలా ఉన్నాయని శివస్వామి మండిపడ్డారు.

ఆది శంకరాచార్యులు భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో అనన్యసాధారణమైన స్థానం కలిగినవారని, అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ చతురామ్నాయ పీఠాలను స్థాపించి దేశాన్ని ఒక ఆధ్యాత్మిక తాటిపైకి తీసుకొచ్చారని గుర్తుచేశారు. అలాంటి మహానుభావుడిపై అవగాహన లేని వ్యాఖ్యలు చేయడం తగదని విమర్శించారు.

వైష్ణవులు, శైవులు మధ్య అనవసరమైన తగాదాలు ఎందుకు సృష్టిస్తున్నారని చినజీయర్ స్వామిని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు హిందూ సమాజంలో చీలికలు తెచ్చే ప్రయత్నంగా భావిస్తున్నామని తెలిపారు. చినజీయర్ స్వామి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని, బహిరంగంగా క్షమాపణ చెప్పే వరకు తాము పోరాటం కొనసాగిస్తామని శివస్వామి స్పష్టం చేశారు.

క్షమాపణ చెప్పకపోతే చినజీయర్ స్వామిని ప్రశాంతంగా ఉండనీయమని హెచ్చరిస్తూ, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం శైవ పీఠాలు ఏకమవుతాయని శివస్వామి ప్రకటించారు.

Also Read:రెండేళ్లలో రేవంత్ చేసింది శూన్యం:కేటీఆర్

- Advertisement -