భర్తకు దూరం కానున్న శిల్పాశెట్టి..?

106
Shilpa Shetty

బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి తన భర్త రాజ్‌కుంద్రాకు విడాకులు ఇచ్చేందుకు సిద్దమవుతున్నట్లు బాలీవుడ్‌ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. రాజ్‌కుంద్రాతో విడిపోయి తన పిల్లలతో కలిసి జీవించాలని ఆమె నిర్ణయం తీసుకున్నట్లు రెండు రోజులుగా బాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల పోర్నోగ్రఫీ కేసులో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన అరెస్ట్‌ బాలీవుడ్ సంచలనంగా మారింది. మరోవైపు రాజ్ కుంద్రాపై పలువురు బాలీవుడ్ స్టార్లు విమర్శలు గుప్పించారు. అయితే ఇప్పుడిప్పుడే ఈ షాక్ నుంచి శిల్పాశెట్టి కోలుకుంటోంది. తిరిగి డ్యాన్స్ రియాల్టీ షోలో పాల్గొంటోంది.

తాజాగా సోషల్ మీడియాలో శిల్పాశెట్టి పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. తప్పులు అందరూ చేస్తారని… అయితే ఆ తప్పులు భయంకరంగా ఇతరులను బాధించేలా ఉండకూడదని ఆమె తెలిపింది. వీటిని తాను సరిదిద్దుకుంటానని చెప్పింది. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. భర్తకు దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకున్నట్టు ఫిల్మ్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకోవడమే తప్పనే భావనలో శిల్ప ఉందని అంటున్నారు. రాజ్ కుంద్రా వల్ల శిల్పాశెట్టి పరువు, ఆమె కుటుంబ పరువు పూర్తిగా పోయిందని… ఈ నేపథ్యంలో ఆయనతో కొనసాగే ఆలోచన శిల్పకు లేదని బాలీవుడ్ టాక్. మరి ఏం జరగనుందో వేచి చూడాలి.