ప్లే ఆఫ్‌లో చోటు దక్కాలంటే కచ్చితంగా గెలువాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జూలు విదిల్చింది. సొంతగడ్డపై గత మ్యాచ్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటూ ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. బౌలర్లు అందించిన శుభారంభాన్ని కొనసాగిస్తూ ధవన్ స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో సన్‌రైజర్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి నాకౌట్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది.
139 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ వార్నర్ (6) రెండో ఓవర్‌లోనే ఔటైనా.. ధవన్ వీరోచితంగా పోరాడాడు. వన్‌డౌన్‌లో హెన్రిక్స్ సమయోచితంగా స్పందించాడు. శిఖర్ ధావన్ (62 నాటౌట్; 46 బంతుల్లో 4×4, 2×6), హెన్రిక్స్ (44; 35 బంతుల్లో 6×4) రాణించడంతో సన్‌రైజర్స్ మరో 10 బంతులు మిగిలివుండగానే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 42 బంతుల్లో 40 పరుగులు చేయాల్సిన దశలో యువరాజ్ (9) ఔటైనా.. ధవన్, విజయ్ శంకర్ (15 నాటౌట్) హైదరాబాద్‌ను లక్ష్యానికి చేర్చారు. ధావన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
అంతకముందు టాస్ గెలిచిన ముంబై నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులు సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (45బంతుల్లో 67; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించగా, పార్థివ్ పటేల్ (23) ఫర్వాలేదనిపించాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో సిద్ధార్థ్ కౌల్‌కు 3, భువనేశ్వర్‌కు 2 వికెట్లు దక్కాయి. 13 మ్యాచ్‌లాడిన సన్‌రైజర్స్‌కు ఇది ఏడో విజయం.