పాక్‌ కొత్త ప్ర‌ధానిగా షెహ‌బాజ్ ష‌రీఫ్ ఎన్నిక‌..

233
Shehbaz Sharif
- Advertisement -

పాకిస్థాన్ కొత్త ప్ర‌ధానిగా షెహ‌బాజ్ ష‌రీఫ్ ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. పాక్ నూతన ప్ర‌ధాని ఎన్నిక కోసం సోమ‌వారం ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మైన ఆ దేశ జాతీయ అసెంబ్లీలో ఓటింగ్ జ‌ర‌గ‌గా.. ష‌రీఫ్ ఏకగ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఈ మేర‌కు పాక్ జాతీయ అసెంబ్లీ తాజాగా ప్ర‌క‌ట‌న చేసింది. పాక్ ప్ర‌ధానిగా మొన్న‌టిదాకా కొన‌సాగిన ఇమ్రాన్ ఖాన్‌పై విప‌క్షాలు అవిశ్వాస తీర్మానం ప్ర‌క‌టించ‌డం, ఆ తీర్మానానికి ఇమ్రాన్ పార్టీ మిత్ర‌ప‌క్షాలు కూడా మ‌ద్ద‌తు ప‌లికిన నేప‌థ్యంలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జ‌ర‌గ‌కుండా ఇమ్రాన్ అందుబాటులో ఉన్న మార్గాల‌ను వినియోగించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆయ‌న చ‌ర్య‌ల‌ను త‌ప్పుబ‌ట్టిన సుప్రీంకోర్టు అవిశ్వాసంపై ఓటింగ్ జ‌ర‌గాల్సిందేన‌ని తీర్పు చెప్పిన విష‌య‌మూ విదిత‌మే.

ఈ నేప‌థ్యంలో ఓటింగ్‌లో ఇమ్రాన్ స‌ర్కారు ఓట‌మిపాలు కాగా.. కొత్త ప్ర‌ధానిగా షెహ‌బాజ్ ష‌రీఫ్‌ను విప‌క్షాలు ప్ర‌తిపాదించాయి. ఈ నేప‌థ్యంలో మెజారిటీని నిరూపించుకోవాలంటూ షెహ‌బాజ్‌కు జాతీయ అసెంబ్లీ పిలుపునిచ్చింది. ఈ మేర‌కు సోమ‌వారం జాతీయ అసెంబ్లీ స‌మావేశం కాగా.. అంత‌కుముందు జాతీయ అసెంబ్లీ స‌భ్య‌త్వానికి త‌న‌తో పాటు త‌న పార్టీ సభ్యులు కూడా రాజీనామా చేస్తున్న‌ట్టు ఇమ్రాన్ ప్ర‌క‌టించారు. అంతేకాకుండా సోమ‌వారం నాటి జాతీయ అసెంబ్లీకి హాజ‌రు కాలేదు. ఫ‌లితంగా పాక్ నూత‌న ప్ర‌ధానిగా షెహ‌బాజ్ ష‌రీఫ్ ఏక‌గ్రీవంగా ఎన్నికయ్యారు.

1951 సెప్టెంబర్ 23న జన్మించిన షహబాజ్ లాహోర్లోని గవర్నమెంట్ కాలేజ్ యూనివర్సిటీ నుంచి బీఏ పూర్తి చేశారు. వృత్తిరిత్యా వ్యాపారవేత్త అయిన ఆయన స్టీల్ బిజినెస్ చేసేవారు. 1985లో లాహోర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్గా షహబాజ్ ఎన్నికయ్యారు. 1980లలో రాజకీయ అరంగేట్రం చేసిన షహబాజ్.. 1997లో తొలిసారి పంజాబ్ సీఎంగా ఎన్నికయయ్యారు. 1999లో సైనిక తిరుగుబాటు అనంతరం కుటుంబంతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఆయన.. 2007లో తిరిగి పాకిస్థాన్లో అడుగుపెట్టారు. 2008లో జరిగిన ఎన్నికల్లో పంజాబ్ ప్రావిన్స్ సీఎంగా ఎన్నికయ్యారు. 2013లోనూ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తన పాలనాకాలంలో సమర్థుడైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న షహబాజ్.. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో తన మార్కు చూపించారు.

2017లో పనామా పేపర్స్ కేసులో దోషిగా తేలడంతో నవాజ్ షరీఫ్ను గద్దె దింపారు. అనంతరం 2018లో జరిగిన ఎన్నికల్లో పీఎంఎల్ఎన్ తరఫున ప్రధాని అభ్యర్థిగా షహబాజ్ షరీఫ్ బరిలో నిలిచారు. అయితే అప్పట్లో పీటీఐ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడంతో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 2020 సెప్టెంబర్లో షహబాజ్ షరీఫ్ ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. 2021 ఏప్రిల్లో మనీలాండరింగ్ కేసులో ఆయన అరెస్ట్ కాగా.. ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చారు. ప్రస్తుతం ఆ కేసు విచారణ ఉంది.

- Advertisement -