హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన ఎగ్జిబిషన్ సందర్భంగా షీ టీం పోలీసులు భారీ స్థాయిలో చర్యలు చేపట్టారు. మహిళలను వేధింపులకు గురిచేసే పోకిరిలపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు మొత్తం 264 మందిని అదుపులోకి తీసుకున్నారు.
పట్టుబడిన వారిలో 242 మంది మేజర్లు, 22 మంది మైనర్లు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో 56 మందిపై కేసులు నమోదు చేశారు. కోర్టు 52 మందికి ఒక్కొక్కరికి రూ.1050 జరిమానా విధించింది. మరో నలుగురికి రెండు రోజుల జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించారు.
మిగతా 188 మందికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. మహిళల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని పోలీసులు స్పష్టం చేశారు. ఎగ్జిబిషన్‌కు వచ్చే మహిళలు, కుటుంబాలు సురక్షితంగా ఉండేందుకు సీసీటీవీ పర్యవేక్షణ, సివిల్ డ్రెస్సులో సిబ్బంది, ప్రత్యేక పహారా వంటి చర్యలు చేపట్టారు.
మహిళలపై వేధింపులు, అసభ్య ప్రవర్తన వంటి చర్యలు సహించబోమని హెచ్చరించిన పోలీసులు, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద వ్యక్తులపై సమాచారం ఇవ్వాలని సూచించారు. షీ టీంల కఠిన చర్యలతో ఎగ్జిబిషన్ ప్రాంగణంలో భద్రతా వాతావరణం నెలకొంది.
Also Read:షూతో కీళ్ల నొప్పులు..షాకింగ్!

