టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే భుజం గాయం నుండి కోలుకున్న శర్వానంద్ తన సినిమా పనుల్ని వేగవంతం చేశారు. ఇప్పటికే ‘రణరంగం’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో పాల్గొంటున్న ఆయన ’96’ తెలుగు రీమేక్ చిత్రీకరణను కూడా మళ్లీ త్వరలోనే స్టార్ట్ చేయనున్నారు.
అయితే ఈ రెండు పనులతో పాటే ఇంకో కొత్త సినిమాను కూడా ఆయన ఈ రోజే స్టార్ట్ చేశారు. ఈ మూవీ తనకు 29వ చిత్రం.కిశోర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం నేడు తాజాగా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ క్లాప్‌నిచ్చారు. శశికాంత్ వల్లూరి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. బుర్రా సాయిమాధవ్ స్క్రిప్ట్ అందించారు.
రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మించనున్న ఈ మూవీ ఆగస్టు నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. 2020 సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీకారం అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కథానాయికగా ఎవరిని ఎంపిక చేస్తారనేది తెలియాల్సి ఉంది.