టాలీవుడ్ లో ‘అర్జున్ రెడ్డి’ సినిమా సెన్సేషనల్ హిట్ అయింది. సందీప్ వంగా దర్శకత్వంలోతెరకెక్కిన అర్జున్ రెడ్డి ఎంత పెద్ద హిట్ సాధించిందో అన్నే వివాదాలకు కేరాఫ్‌గా మారింది. సినిమా పోస్టర్ దగ్గరి నుంచి లిప్ లాక్ సీన్స్ వరకు అభ్యంతరకరంగా ఉన్నాయని పలువురు ఆందోళన బాట చేపట్టిన ప్రేక్షకులు మాత్రం సినిమాను ఆదరించారు. దీంతో చిన్న సినిమాగా విడుదలైన అర్జున్ రెడ్డి భారీ కలెక్షన్స్‌ని సాధించిపెట్టింది.
ఇదిలా ఉంటే.. ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో నటించనందుకు తనకు బాధగా ఉందని హీరో శర్వానంద్ అన్నాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘అర్జున్ రెడ్డి’ సినిమా కథను ముందుగా తనకు వినిపించారని, కానీ, నటించేందుకు తాను ఒప్పుకోలేదని చెప్పాడు.
ఈ సినిమాకు నిర్మాత, దర్శకుడు ఒకరే అయితే తాను చేయనని, నిర్మాత బాధ్యతలు కూడా దర్శకుడిపై పడితే సరిగా న్యాయం చేయలేరని తాను అప్పుడు అనుకున్నానని చెప్పాడు. ఇక, ‘అర్జున్ రెడ్డి’లో విజయ్ దేవరకొండ చాలా బాగా నటించాడని, ఈ సినిమాను సరైన నటుడే చేశాడని చెప్పిన శర్వానంద్, ఈ మధ్య కాలంలో వచ్చిన ఉత్తమ చిత్రం ‘అర్జున్ రెడ్డి’ అని ప్రశంసించాడు.