కాషాయపార్టీకి ఓటమి ఫిక్స్..!

148
sharad
- Advertisement -

ప్రస్తుతం దేశంలోని నాలుగు రాష్ట్రాలు. ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఏప్రిల్ – మే నెలల్లో జరుగబోతున్న అసెంబ్లీ ఎన్నికలు రాజకీయపార్టీలలో తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, అసోం రాష్ట్రాలతో సహా, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.తమిళనాడులో అధికార అన్నాడీఎంకే, బీజేపీ కూటమి మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఇక్కడ ప్రతిపక్ష డీఎంకే, కాంగ్రెస్ కూటమికి విజయావకాశాలు ఉన్నాయని తేలడంతో పళినిస్వామి సర్కార్ తమిళనాడు ప్రజలకు ఆల్ ఫ్రీ అంటూ వరాల జల్లు కురిపిస్తోంది. అయినా ఇక్కడ అన్నాడీఎంకే రెండాకులు, కమలం రేకులు రాలిపోవడం ఖాయమని తెలుస్తోంది.

ఇక కేరళలో వామపక్ష కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందని తెలుస్తోంది. సీఎం విజయన్‌కు ఉన్న క్రేజ్‌‌తో ఎల్డీఫ్‌కు మరోసారి కేరళ ప్రజలు పట్టం కడతారని, ఇక్కడ బీజేపీకి కేవలం 2 సీట్లు మాత్రమే వస్తాయని ముందస్తు సర్వేలు తేల్చిచెబుతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న పశ్చిమబెంగాల్‌లో మమతాదీదీదే మళ్లీ అధికారం అని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీల మధ్య గట్టి పోటీ ఉన్నప్పటికీ చివరకు మమతాబెనర్జీనే పైచేయి సాధిస్తుందని, ఇక్కడ మోదీ, అమిత్‌షాలకు భంగపాటు తప్పదని తెలుస్తోంది. ఒక్క అసోంను మాత్రం బీజేపీ నిలబెట్టుకోనున్నట్లు తెలుస్తోంది.

తాజాగా నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్‌ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక అసోంలో మినహా మిగిలిన నాలుగు చోట్ల బీజేపీ ఘోర పరాజయం ఎదుర్కోవడం ఖాయమని శరద్ పవార్ జోస్యం చెప్పారు. మహారాష్ట్రలోని పుణే జిల్లా బారమతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ…ఇప్పుడు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు దేశానికి ఒక దిశానిర్దేశం చేయనున్నాయని అన్నారు. అయిదు చోట్ల ఫలితాలపై ఇప్పుడే మాట్లాడటం సరికాదన్నారు. కేరళలో వామపక్షాలు, ఎన్‌సీపీ కలిసి పనిచేస్తున్నాయని, అక్కడ తాము స్పష్టమైన మెజార్టీ సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు.

తమిళనాడు ప్రజలు డీఎంకే పార్టీకే మద్దతు ఇస్తున్నారని, అక్కడ ఎంకే స్టాలిన్‌ అధికారంలోకి వస్తారన్నారు. పశ్చిమ బెంగాల్‌లో కేంద్రం, ముఖ్యంగా బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఆరోపించారు. ప్రజల కోసం పోరాడుతున్న సోదరి మమతా బెనర్జీపై దాడిచేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. అక్కడ మమత నాయకత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారం నిలుపుకుంటుందని స్పష్టం చేశారు.. ఇక పుదుచ్చేరిలో గట్టిపోటీ ఉన్నా అక్కడ బీజేపీ కుట్రలకు బలైపోయిన కాంగ్రెస్ పార్టీపై సానుభూతి ఉందని, మళ్లీ అక్కడ హస్తం పార్టీదే హవా అని పవార్ చెప్పుకొచ్చారు. మొత్తంగా అసోం మినహా, కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఓడిపోవడం ఖాయమని శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. మరి పవార్ జోస్యంపై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

- Advertisement -