సెంటిమెంట్‌ వార్..పైచేయి ఎవరిదో..!

256
ktr karimnagar trs
- Advertisement -

త్వరలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగనుండటంతో దేశవ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. ఇక ముఖ్యంగా తెలంగాణలో రాజకీయ రణరంగం తారస్ధాయికి చేరింది. ఇప్పటికే టీఆర్ఎస్ ఎన్నికల శంఖారావాన్ని పూరించగా బీజేపీ సైతం కథనరంగంలో కాలుమోపింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీకి తొలినుండి కలిసొచ్చిన కరీంనగర్‌ సెంటిమెంట్‌కే జైకొట్టగా బీజేపీ చీఫ్ అమిత్ షా నిజామాబాద్ నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ సైతం ఈ నెల 9న భారీ బహిరంగసభలో పాల్గొని మాట్లాడనున్నారు.

అయితే ఇక్కడ విశేషమెంటంటే అధికార టీఆర్ఎస్,ప్రతిపక్ష కాంగ్రెస్‌ తమకు అచ్చొచ్చిన సెంటిమెంట్‌నే ఫాలో అవుతున్నాయి. టీఆర్ఎస్ ఏ పెద్ద కార్యక్రమాన్ని ప్రారంభించిన కరీంనగర్‌ నుండే శ్రీకారం చుట్టేది. దాని ఫలితం కూడా కేసీఆర్‌,టీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉండటంతో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించారు టీఆర్ఎస్ నేతలు.

ఇక వైఎస్ హయాంలో ఆయన ఏ కార్యక్రమం అయినా చేవెళ్ల నుండే ప్రారంభించేవారు. చేవెళ్ళ నుండే ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ పథకాలు, ఎన్నికల ప్రచారం బాగా కలిసి వచ్చింది. వైఎస్ హయాంలో చేవెళ్ళ సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయింది. దీంతో కాంగ్రెస్ నేతలు చేవెళ్లను రాహుల్ ఎన్నికల శంఖారావ సభకు ఎంచుకున్నారు.

దీంతో కాంగ్రెస్‌-టీఆర్ఎస్ సెంటిమెంట్ రాజకీయాలతో పొలిటికల్ వాతావరణం హీటెక్కింది. అయితే ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ హవా వీస్తుండటం,ప్రజలంతా కేసీఆర్ సంక్షేమ పథకాలపై పూర్తి విశ్వాసంతో ఉండటంతో 16 ఎంపీ స్ధానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తుండగా చేవెళ్ల సెంటిమెంట్‌తో బరిలోకి దిగుతున్న హస్తం నేతలు మెరుగైన ఫలితాలు సాధిస్తామని నమ్మకంతో ఉన్నారు. మొత్తంగా సెంటిమెంట్‌ వార్‌లో గెలిచేది ఎవరో తెలియాలంటే కొంతకాలం వేచిచూడాల్సిందే.

- Advertisement -