మేడారం జాతర..జాగ్రత్తలు పాటించండి!

9
- Advertisement -

మేడారం మహాజాతరను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు భక్తులంతా అవసరమైన జాగ్రత్తలు పాటించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ఈ నెల 28 నుంచి 31 వరకు అంగరంగ వైభవంగా జరగనున్న వనదేవతల జాతరకు లక్షలాది మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో భద్రత, సౌకర్యాలపై ఆమె కీలక సూచనలు చేశారు.

భక్తులు క్షేమంగా వచ్చి, క్షేమంగా తిరిగి వెళ్లేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి కోరారు. జాతర సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వాహనాలను నెమ్మదిగా, క్రమశిక్షణతో నడపాలని సూచించారు. ముఖ్యంగా ఓవర్టేక్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశముందని, అలాంటి చర్యలను పూర్తిగా నివారించాలని తెలిపారు. ట్రాఫిక్ పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే, దేవతల గద్దెల వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున గ్రిల్స్ ఎక్కడం, గద్దెలను ముట్టుకునేందుకు సాహసాలు చేయడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. ఇటువంటి చర్యలు మీ ప్రాణాలకు ముప్పుగా మారడమే కాకుండా, ఇతర భక్తులకూ ఇబ్బందులు కలిగిస్తాయని హెచ్చరించారు.

Also Read:Modi:వికసిత్ భారత్ దిశగా అడుగులు

జాతర సమయంలో ప్రతి భక్తుడు స్వీయ నియంత్రణ, స్వీయ క్రమశిక్షణ పాటించడం ఎంతో అవసరమని మంత్రి సీతక్క అన్నారు. అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ, భక్తుల సహకారం లేకుండా జాతర విజయవంతం కాదని తెలిపారు. భక్తులందరూ పరస్పరం సహకరించి, ప్రశాంత వాతావరణంలో మేడారం మహాజాతరను విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

- Advertisement -