తెలంగాణలోని పవిత్ర క్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీ సీతారాముల కల్యాణం కన్నులపండువగా ఘనంగా జరిగింది. వేలాది మంది భక్తులు ఈ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తూ భక్తిరసంలో మునిగిపోయారు. జై శ్రీరామ్ నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా భద్రాచలానికి విచ్చేసి, శ్రీ సీతారామచంద్రస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మిథిలా స్టేడియంలో నిర్వహించిన స్వామివారి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచింది.
కల్యాణ వేడుకలలో సీఎం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడంతో పాటు ముత్యాల తలంబ్రాలను అర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి, సీఎం కుటుంబానికి ఆశీర్వాదాలు అందజేశారు.
ఇక ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. తొలి విడతలో రూ. 351 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ఆలయ పరిసరాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

