నంద్యాల ఉపఎన్నిక ఫలితం ప్రకటన తర్వాతి పరిణామాలపై పోలీసులు పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ర్యాలీలు, బాణసంచా పేల్చడం నిషేధించినట్లు ఎస్పీ తెలిపారు. నంద్యాల్లో 144 సెక్షన్ విధించారు. ఎక్కడా ప్రజలు గుంపులుగుంపులుగా ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు.
నంద్యాల పట్టణంలో 30 పోలీస్ యాక్టు, 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఎటువంటి సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. ఎవరూ రెచ్చగొట్టేవిధంగా వ్యాఖ్యలు చేయవద్దని, కవ్వింపు చర్యలకు గానీ పాల్పడవద్దని అన్నారు.
ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి 600 మందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని, ఇతర పోలీసు బలగాలు, పారా మిలటరీ బలగాలు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గెలుపొందిన అభ్యర్థులు, వారి మద్దతుదారులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం, డప్పులు వాయించడం, పెద్ద శబ్దాలు చేయడం వంటి వాటిని నిషేధమన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతున్నందున అటువైపు వెళ్లే దారులను మూసివేశారు. పలు రహదారులు మూసివేసినందున, ఇందుకు ప్రజలు సహరించాలని ఎస్పీ కోరారు.