అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థులు హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య రెండో విడత చర్చ ఆసక్తికరంగా సాగుతోంది. వాడీవేడీగా సాగిన తొలి విడత చర్చలో హిల్లరీ క్లింటన్ పైచేయి సాధించిన హిల్లరీ…రెండో విడత చర్చలోను అదేజోరు కంటిన్యూ చేసింది. సెయింట్ లూయిస్‌లోని మిస్సోరీలోని టౌన్‌హాల్ వేదికగా 90 నిమిషాల పాటు వాడీవేడిగా అధ్యక్ష అభ్యర్థుల మధ్య చర్చ సాగింది.
ట్రంప్ మహిళలపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలు చూస్తే ఆయనకు మహిళలంటే గౌరవం లేదని హిల్లరీ అన్నారు. ఇలాంటి వ్యక్తి ప్రపంచంలోనే అగ్రదేశం అయిన అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపడితే దేశం భవిష్యత్తు అంధకారంలోకి పోతుందని ఆమె అన్నారు. అయితే తనకు మహిళలంటే చాలా గౌరవమని తనకంటే ఎక్కువగా మహిళలను మరెవరూ గౌరవించరని చెప్పుకొచ్చాడు ట్రంప్.
ట్రంప్ : హిల్లరీ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. అధికార వ్యవహారాలకు తన వ్యక్తిగత ఈ మెయిల్ ఎందుకు వాడారో చెప్పాలి..? 33 ఈ మెయిల్స్‌ను ఎందుకు తొలగించారో బయటపెట్టాలి. నేను గెలిస్తే దీనిపై విచారణ జరిపి హిల్లరీని జైలుకు పంపిస్తా
హిల్లరీ : ఈమెయిల్స్ విషయంలో నేను చేసిన పొరపాటును సరిదిద్దుకున్నాను. ప్రజలకు ఎప్పుడో క్షమాపణలు చెప్పాను
హిల్లరీ : అమెరికా దేశం ఉగ్రవాదానికి వ్యతిరేకం కానీ ఓ మతానికి మాత్రం కాదు. ట్రంప్ ముస్లింలను పదే పదే అవమానపరుస్తున్నాడు. అమెరికా సైట్లను రష్యా హ్యాక్ చేస్తుంది. పుతిన్ ట్రంప్‌ను ఎందుకు సమర్థిస్తున్నారు..?
ట్రంప్ : రష్యాను నిందించడం హిల్లరీకి అలవాటైనట్లుంది. అయినా రష్యా గురించి నాకేమీ తెలియదు. పుతిన్ గురించి అంతకన్నా తెలియదు.
బిగ్ డిబేట్ 2 సందర్భంగా పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ట్రంప్-హిల్లరీ ఇద్దరూ కనీసం కరచాలనం కూడా చేసుకోలేదు. ఈ కార్యక్రమంలో ప్రేక్షకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చాలా మంది ప్రజారోగ్య పరిరక్షణ.. సిరియా సంక్షోభం.. శరణార్థులపై.. పన్నుచట్టాలపై ప్రశ్నలు సంధించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ ‘అమెరికాలో ముస్లింలపై నిషేధం’ అంశంపై స్పందించాలన్నారు. హిల్లరీ క్లింటన్‌ను పలువురు అనధికారిక మెయిల్ వినియోగంపై ప్రశ్నించారు. మెయిల్స్ డిలీట్ చేసిన అంశంపై సమాధానం ఇచ్చే క్రమంలో హిల్లరీ ఒక దశలో కొంత ఇబ్బందికి గురయ్యారు.