తెలంగాణలో రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికల ప్రక్రియ ఈరోజు నుంచి ప్రారంభమైంది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుల పదవీకాలం ఈ ఏడాది మార్చి 29వ తేదీతో ముగియనుంది. ఆ స్థానాల భర్తీకి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది. మంగళవారం మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గానికి ఎన్నికల అధికారిగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అదనపు కమిషనర్ , వరంగల్-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గానికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మండలి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు.
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం నుంచి ఈ నెల 23వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 24న నామినేషన్లను పరిశీలించనున్నారు. 26వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు విధించారు. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. మార్చి 17న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ స్థానంలో 5.60 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 616 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. డీఆర్సీ కేంద్రంగా ఎల్బీ స్టేడియంలోని ఇండోర్ స్టేడియం ఉండనుంది. అలాగే వృద్ధులు, దివ్యాంగులు, కొవిడ్ బాధితులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించనున్నారు. ఈరోజు నుంచి 5 రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులను స్వీకరించనున్నారు.