పండుగ పూట నిరుద్యోగ యువకులకు తీపి కబురు అందించింది. సింగరేణితో పాటు గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువరించనుంది. సింగరేణిలో 750 పోస్టుల భర్తీకి సింగరేణి సంస్థ ఈ నెల 23న నోటిఫికేషన్ జారీ చేయనుంది. కార్మిక హోదా పోస్టులు 643, ఎగ్జిక్యూటివ్ పోస్టులు 107. కార్మిక ఉద్యోగాల్లో.. ఫిట్టర్ ట్రైనీ 288, ఎలక్ట్రిషియన్ ట్రైనీ 143, అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ 69, టర్నర్/మెషినిస్టు ట్రైనీ 51, సబ్ ఓవర్‌సీస్ ట్రైనీ(సివిల్) 35, అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ(ఎలక్ట్రికల్) 24, మౌల్డర్ ట్రైనీ 24, మెల్టర్ 1, మోటార్ మెకానిక్ ట్రైనీ 8 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది. అధికార పోస్టులు.. మేనేజ్‌మెంట్ ట్రైనీ(ఇఅండ్‌ఎం) 68, మేనేజ్‌మెంట్ ట్రైనీ(ట్రైనింగ్) 37, మేనేజ్‌మెంట్ ట్రైనీ(హైడ్రో జియాలజిస్టు) 1, మేనేజ్‌మెంట్ ట్రైనీ(జియో ఫిజిస్టు) 1.
టీచర్ పోస్టులకు ప్రకటన వస్తుందని ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు టీఎస్‌పీఎస్సీ చేస్తున్న కసరత్తు చూస్తే ఆశలు చిగురిస్తున్నాయి. ప్రభుత్వ స్కూళ్లల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ దిశగా విద్యాశాఖ, టీఎస్‌పీఎస్సీ చర్యలు వేగవంతం చేశాయి. అక్టోబరులోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చేసిన ప్రకటనకు అనుగుణంగా పక్కాగా నోటిఫికేషన్ జారీ చేసే విధంగా కసరత్తు చేస్తున్నారు అధికారులు.