కొంతకాలంగా కేరళలో అయ్యప్పస్వామి ఆలయం శబరిమలలో వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ప్రవేశించవచ్చని సుప్రీం తీర్పు ఇవ్వడంపై బీజేపీ అనుబంధ సంస్థలు ఆందోళన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో శబరిమల అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
అన్ని వయసుల మహిళలు ఆలయంలోకి వెళ్లవచ్చు అని బోర్డు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం ముందు తెలిపింది. మహిళల ప్రవేశంపై సుప్రీం తీర్పును గౌరవిస్తామని, ఈ విషయమైన పిటిషన్ వేశామని, మహిళల ప్రవేశంపై తమ నిర్ణయాన్ని మార్చుకున్నామని బోర్డు సభ్యులు వెల్లడించారు.సమానత్వం అనేది రాజ్యాంగ నియమం అని పేర్కొన్నారు.
అయితే శబరిమల ఆలయ ప్రధాన పూజారి మాత్రం ట్రావెన్ కోర్ బోర్డు నిర్ణయాన్ని వ్యతిరేకించారు. శబరిమలపై సుప్రీం ఇచ్చిన తీర్పుపై రివ్యూ కోరుతూ మొత్తం 65 పిటిషన్లు దాఖలు అయ్యాయి. అయితే ఇవాళ వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును మాత్రం రిజర్వులో ఉంచింది.