సింగరేణి సంస్థ అభివృద్ధిలోనే కాక ఎస్.సి, ఎస్.టి.లకు ఉద్యోగావకాశాలు, ప్రమోషన్లు కల్పించడంలో అత్యద్భుతంగా పనిచేస్తోందని,రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్ష మేరకు పనిచేస్తున్న సంస్థ సి&ఎం.డి. ఎన్.శ్రీధర్‌కు తాను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానని తెలంగాణ ఎస్.సి., ఎస్.టి. కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రశంసించారు. హైద్రాబాద్ సింగరేణి భవన్‌లో సోమవారం (ఆగష్టు 5వ తేదీ) నాడు జరిగిన ఎస్.సి., ఎస్.టి. కమిషన్ సమీక్ష సమావేశంలో ఆయన ప్రసంగించారు. సింగరేణి సి ఎం.డి. ఎన్.శ్రీధర్‌తో పాటు సంస్థ డైరెక్టర్లు, సింగరేణి ఎస్.సి., ఎస్.టి. ఉద్యోగ సంఘాల నాయకులు, లైజన్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సి ఎం.డి.ఎన్.శ్రీధర్ కమిషన్‌కు స్వాగతం తెలుపుతూ సింగరేణి సంస్థ సింగరేణీయుల సంక్షేమానికి తీసుకొంటున్న చర్యలను, గత ఐదేళ్ల కాలంలో సాధించిన ప్రగతిని వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అందిస్తున్న సహకారంతో సింగరేణి వృద్ధి రేటులో దేశంలోనే నెంబర్-1 కంపెనీగా నిలిచిందని, మహారత్న కంపెనీలకు ధీటుగా ఎదిగిందని వివరించారు. ఉత్పత్తితో పాటు సంక్షేమంలో కూడా దేశంలో నెంబర్-1 కంపెనీగా సింగరేణి ఉందని పేర్కొన్నారు. ఎస్.సి., ఎస్.టి. రిజర్వేషన్లను నిబంధనల ప్రకారం పాటిస్తున్నామని వివరించారు. సింగరేణి సంస్థలో మొత్తం నలుగురు డైరెక్టర్లలో ఇద్దరు ఎస్.టి., ఎస్.సి. వర్గాల నుండి ఉన్నారని అలాగే కీలకమైన రిక్రూట్ మెంట్, వెల్ఫేర్, ఐ.ఇ.డి. తదితర విభాగాలతో పాటు కొన్ని ఏరియాల జి.ఎం.లుగా ఎస్.సి., ఎస్.టి. కులాల వారు పనిచేస్తున్నారని వివరించగా కమిషన్ తన హర్షం ప్రకటించింది.
సింగరేణి సంస్థలో ఎస్.సి., ఎస్.టి. కులాల వారికి ఉద్యోగాలు, ప్రమోషన్ల విషయంలో సింగరేణి సంస్థ రిజర్వేషన్ నిబంధనల ప్రకారం చేపట్టిన చర్యలను డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు పా ఎస్.చంద్రశేఖర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. తెలంగాణా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరింత పకడ్భందీగా సాగుతున్న రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ప్రక్రియ, కొత్త ఉద్యోగాల్లోనూ, డిపార్టుమెంటు ప్రమోషన్లలోనూ నిబంధనలను పాటిస్తున్న విషయాన్ని ఆయన గణాంక వివరాల ద్వారా తెలియజేశారు.
అనంతరం కమీషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ స్పందిస్తూ.. చాలా ప్రభుత్వ సంస్థల్లో కమిషన్ వారు చెప్పిన తర్వాతనే రిజర్వేషన్లు అమలు జరుపుతున్నారనీ,కానీ సింగరేణిలో సి ఎం.డి.రిజర్వేషన్ నిబంధనలను పాటిస్తూ ఆదర్శంగా నిలిచారని, అంబేద్కర్ జయంతికి సెలవు ప్రకటించడం, ఎస్.సి., ఎస్.టి. ఉద్యోగుల అభ్యున్నతికి పాటు పడడంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కోరిక మేరకు సింగరేణిని దేశంలో నెంబర్-1 స్థానానికి ఎదిగేలా కృషి చేసిన సి&ఎం.డి. ఎన్.శ్రీధర్‌కు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నానని కమిషన్ సభ్యుల హర్షధ్వానాల మధ్య తెలియజేశారు.
అంతకుముందు ఆయన సింగరేణి ఎస్.సి, ఎస్.టి. ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. ఎస్.సి., ఎస్.టి. ఉద్యోగులు ఒకే సంఘంగా ఏర్పడాలనీ, విబేధాలు వీడాలనీ, తద్వారా బలం పెంచుకొని కార్మికులకు మేలు చేయాలని హితవు పలికారు. ఉద్యోగ సంఘాల వారు సమర్పించిన సమస్యలపై సమీక్ష సమావేశంలో డైరెక్టర్ (ఆపరేషన్స్ మరియు పా) ఎస్.చంద్రశేఖర్ వివరణ ఇచ్చారు. ఎస్.సి, ఎస్.టి. లకు ఉద్దేశించిన కాచ్ అప్ రూల్, ప్రమోషన్లు మొదలైన కొన్ని కీలకాంశాలు కోర్టులో ఉన్నాయనీ, కోర్టు నుండి ఈ అంశాలు బయటపడగానే సమస్యలను పరిష్కరిస్తామన్నారు. సింగరేణి యాజమాన్యం తమ అభ్యర్ధన పట్ల,తమ పట్ల ఎంతో సానుకూలంగా స్పందిస్తోందనీ, ముఖ్యంగా అంబేద్కర్ జయంతిని సెలవు దినంగా ప్రకటించడంపై ఎస్.సి., ఎస్.టి. సంఘాల నాయకులు తమ ధన్యవాదాలు తెలిపారు.
ఈ సమీక్షా సమావేశంలో కమిషన్ సభ్యులు రాంబాల్ నాయక్,కుర్సం నీలాదేవి, చిలకమర్రి నర్సింహ, సుంకర దేవయ్య ఇంకా సంస్ధ డైరెక్టర్ ఇ&ఎం ఎస్.శంకర్,డైరెక్టర్ (ఆపరేషన్స్ మరియు పా) ఎస్.చంద్రశేఖర్, డైరెక్టర్ ఫైనాన్స్ ఎన్.బలరాం, జి.ఎం. సి.డి.ఎన్. ఆంటోనిరాజా, జి.ఎం. పర్సనల్ (ఆర్.సి., ఐ.ఆర్.&పి.ఎం.) ఎ.ఆనందరావు, జి.ఎం. పర్సనల్ (వెల్ఫేర్ & సి.ఎస్.ఆర్.) కె.బసవయ్య, లైజన్ ఆఫీసర్లు వి.క్రిష్ణయ్య, కలవల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.