ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త. ఇప్పుడు ఈ ఖాతాదారులకు ఎలాంటి చార్జీలు లేకుండా క్రెడిట్ కార్డ్ రానుంది. అవును..ఈ విషయాన్ని ఎస్‌బీఐ చీఫ్ అరుంధతి భట్టాచార్య ప్రకటించారు. దాంతో ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్టైంది. బ్యాంకు ఖాతాలో రూ.20,000 నుంచి రూ.25,000 లోపు నిల్వ ఉంచుకునే ఖాతాదారులకు ఎటువంటి క్రెడిట్ హిస్టరీ చూడకుండానే ఉచితంగా క్రెడిట్ కార్డును ఇవ్వనుంది.
అయితే ఎస్‌బీఐలో ఐదు బ్యాంకులు విలీనం తర్వాత ఆ బ్యాంకు తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ఇదే. ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోడానికి కారణం డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకేనని తెలిపారు. అయితే ఎస్‌బీఐ ‘ఉన్నతి’ పథకం కింద నాలుగు సంవత్సరాల పాటు క్రెడిట్ కార్డుపై ఎటువంటి వార్షిక ఫీజు తీసుకోకుండా ఈ కార్డులను మంజూరు చేయనున్నారు.
అంతేకాకుండా.. ప్రస్తుతం ఖాతాల్లో సరైన నిల్వలు లేకపోవడంతో పాటు క్రెడిట్ కార్డు బకాయిలు బ్యాంకుకు సవాలుగా మారాయని అరుంధతి భట్టాచార్య అన్నారు. అందువల్లే కొత్తగా చేరే వినియోగదారులు తమ బ్యాంకు ఖాతాల్లో నిల్వలు ఉంచుకునేలా ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. దాంతో క్రెడిట్ కార్డుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఇది దోహదపడుతోందని అరుంధతి పేర్కొన్నారు.