సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లి గ్రామంలో జరిగే సర్పంచ్ ఎన్నికలు ఒక ప్రేమజంట జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వ్ అయిన సర్పంచ్ పదవిలో తన ప్రేయసి శ్రీజను పోటీకి నిలబెట్టాలని బీసీ యువకుడు చంద్రశేఖర్ గౌడ్ నిర్ణయించడంతో గ్రామంలో విశేష చర్చ నడుస్తోంది. తన ప్రేయసి సామాజిక వర్గ రిజర్వేషన్‌కు అర్హురాలు అని తెలుసుకున్న వెంటనే, తనతో కలిసి ఆమెను సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయించాడు.
అయితే ఈ విషయం తెలుసుకున్న శ్రీజ తల్లిదండ్రులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. నామినేషన్‌ను వెనక్కి తీసుకోవాలని ఆమెపై ఒత్తిడి తేల్చిన తల్లిదండ్రులు పెళ్లికి కూడా నిరాకరించారు. ఈ నేపథ్యంలో ప్రేమజంట రాత్రికి రాత్రే యాదగిరిగుట్టకు వెళ్లి వివాహం చేసుకుని ఒకరికి ఒకరు అండగా నిలిచారు.
వివాహం అనంతరం శ్రీజ మాట్లాడుతూ, తాను మేజర్‌ని, తన ఇష్టంపైనే చంద్రశేఖర్‌ను పెళ్లి చేసుకున్నానని, ఇకపై తమను ఎవరూ ఇబ్బంది పెట్టకూడదని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసింది. తన భర్త సహాయంతో సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించగలనని, ప్రజలు తనకు మద్దతు ఇస్తే గ్రామ అభివృద్ధికి కట్టుబడి కృషి చేస్తానని చెప్పింది.
Also Read:కేరళ సీఎం విజయన్‌కు ఈడీ నోటీస్
చంద్రశేఖర్ కూడా ఆమెకు పూర్తి సహకారం అందిస్తానని వెల్లడించగా, ఈ ప్రేమజంటకు స్థానిక బీఆర్ఎస్ నాయకులు భరోసా తెలుపుతూ తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
సర్పంచ్ పదవి ఒక ప్రేమకథను కొత్త దిశలోకి నడిపి, గ్రామ రాజకీయాల్లో కొత్త ఆసక్తిని రేపింది.

