శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ 143వ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్లో విధాన సభ వద్దనున్న సర్దార్ పటేల్ విగ్రహానికి పార్లమెంట్ సభ్యులు మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పుష్పాంజలి ఘటించడం జరిగింది. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ గారు మాట్లాడుతూ: ఆనాడు సర్ధార్ పటేల్ రాజనీతిజ్ఞత (Statesmanship)తో సంస్థానాల సమస్యను పరిష్కరించకపోతే నేడు మనం నివసిస్తున్న సమైక్య భారత్ ఏర్పడి ఉండేది కాదు. స్వాతంత్రానంతరం ముక్కలు ముక్కలుగా ఉన్న దేశాన్ని ఏకం చేసిన ఉక్కుమనిషి వల్లభాయ్ పటేల్. చిన్నాభిన్నమైన దేశాన్నే కాక, చెల్లా చెదురుగా ఉన్న జాతిని సైతం ఒక్కతాటిపై తీసుకొచ్చిన మహానేత సర్దార్ పటేల్. సమైక్య భారత్ సర్దార్ పటేల్ పెట్టిన బిక్ష. అన్నారు.
స్వాతంత్య్ర పోరాట చరిత్ర అంటే కేవలం నెహ్రు, గాంధీలదే చరిత్రే అంటూ ఇన్నాళ్లు దేశ ప్రజలను మోసగించిన కాంగ్రెస్కు నేడు తగిన బుద్ది చెప్పారు. కాంగ్రేస్ కుసంస్కారంతో మరుగునపడిపోయిన అనేక మంది స్వాతంత్ర వీరుల పోరాట గాథ నేడు పటేల్ విగ్రహ ఆవిష్కరణతో వెలుగులోకి రావడం ఖాయం.
స్వాతంత్ర్యానంతరం దేశ వ్యాప్తంగా ఉన్న 550 చిన్న, పెద్ద సంస్థానాలను సామ, దాన, వేద, దండోపాయాలను ప్రయోగించి విశాల భారత ఏర్పాటుకు కృషి చేసిన ఆ మహా నాయకుడికి, నేడు దేశం లోని 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల ప్రజలు తమ, తమ ప్రాంతంలోని నీరు మట్టి ఇనుము (ఉక్కు)తో యోగదానం చేసి 597 అడుగుల ఎత్తుతో, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం ‘Statue of Unity’ పేరుతో ఏర్పాటు చేయటం సర్దార్ పటేల్ కలలుగన్న దేశ ప్రజల సమగ్రతకు అద్ధం పడుతుంది. అని అన్నారు దత్తాత్రేయ.
నేడు భారత దేశంలో పటేల్ జయంతిని అధికారికంగా నిర్వహించి , వారిని నిత్యం స్మరించుకోవాల్సిన భాద్యత ఎవరిపై అయినా ఉందంటే అది ఒక్క తెలంగాణ ప్రజలపైన, ప్రభుత్వంపైన ఉంది. నిజాం నిరంకుశ పాలనను, రజాకార్ల దౌర్జన్యాలను ఎదురించి కొమరం భీం, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య లాంటి అసామాన్య వీరులు సాగించిన పోరాటాలకు ఊతం ఇస్తూ నాటి ప్రధాని నెహ్రు ద్వంద నీతిని ఎండగట్టి, నిజాంపై దండెత్తి, కేవలం నాలుగు రోజుల్లోనే నిజాం మరియు రజాకార్ల ఆగడాలను కట్టడి చేసి, నిజాం కోటపై మువ్వన్నెల జెండాను ఎగరవేసి, తెలంగాణా ప్రజలకు స్వేచ్చావాయువులు అందించిన ధృడశీలి సర్ధార్ పటేల్.
సర్దార్ పటేల్ ప్రవచించిన సమైక్య భారత్, సమగ్రత, సమైక్యతలే లక్యంగా పనిచేస్తున్న గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని మరొక్కసారి బలపర్చాల్సిందిగా ప్రజలను కోరుతున్నాను. అపుడే సర్దార్ పటేల్ కలలుగన్న, సమైక్య, పటిష్ట, నవభారత్ల లక్ష్యం సాధ్యమవుతుందాని అన్నారు.