తమిళనాడు రాజకీయాలు రోజురోజుకు మలుపుతిరుగుతున్నాయి. ఇప్పటివరకు అన్నాడీఎంకే కూటమిలో ఉన్న శరత్ కుమార్ ఆలిండియా సమతువ మక్కల్ కట్చి (ఏఐఎస్‌ఎంకే) రానున్న ఎన్నికల్లో ఇందియా జననాయగ కట్చితో (ఐజేకే)తో పొత్తుపెట్టుకుని కూటమిగా బరిలో దిగుతామని వెల్లడించారు.
మంచి పేరు, నడవడిక ఉన్న వారినే మా కూటమి తరఫున బరిలో దించుతామని ఆయన చెప్పారు. తాను కమల్ హాసన్‌ను కూడా కలిసి పొత్తు విషయమై మాట్లాడానని, తన ప్రతిపాదనపై ఎలా ముందుకు వెళ్లాలనేది వాళ్లు నిర్ణయించుకుంటారని చెప్పారు. మేం మాత్రం వారు త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని శరత్‌కుమార్ అభిప్రాయపడ్డారు.
ఐజేకే సహవ్యవస్థాపకుడు పారివెందర్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే గుర్తుతో పోటీచేసి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ రెండు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడటం ప్రాధాన్యం సంతరించుకుంది.