హంస వాహనంపై శ్రీ‌ మలయప్ప

36
- Advertisement -

శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో రెండ‌వ‌ రోజు మంగ‌ళ‌వారం రాత్రి మలయప్పస్వామివారు హంస వాహనంపై వీణ ధ‌రించి స‌ర‌స్వ‌తి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన వాహ‌న‌సేవ‌లో వివిధ క‌ళాబృందాల ప్ర‌ద‌ర్శ‌న‌లు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు స్వామివారిని వాహ‌న‌సేవ‌లో ద‌ర్శించుకున్నారు.

హంస వాహనసేవలో శ్రీ మలయప్పస్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచిక. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్ర‌హ్మ‌ప‌ద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి.

వాహ‌న‌సేవ‌లో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ వెంక‌ట ర‌మ‌ణా రెడ్డి, జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో న‌ర‌సింహ కిషోర్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Also Read:నూడుల్స్ తింటున్నారా.. జాగ్రత్త !

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం రాత్రి హంస వాహన సేవలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన కళాబృందాలు చక్కటి ప్రదర్శనలు ఇచ్చాయి.ఇందులో శ్రీవేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో నర్తన గణపతి కళారూపకం ఆకట్టుకుంది.

- Advertisement -