సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం

5
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం త్రివేణి సంగమ తీరంలో సరస్వతీ నది అంత్య పుష్కర వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి జూన్ 1వ తేదీ వరకు 12 రోజుల పాటు ఈ పుష్కరాలు నిరంతరాయంగా సాగనున్నాయి. ఆధ్యాత్మిక శోభతో పులకించిపోతున్న కాళేశ్వర క్షేత్రం, దేశం నలుమూలల నుండి వచ్చే భక్తులకు స్వాగతం పలికేందుకు సిద్ధమైంది.

శాస్త్రోక్తంగా ప్రారంభమైన ఈ అంత్య పుష్కరాలలో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి పాల్గొని, త్రివేణి సంగమంలో తొలి పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం నదీ మాతకు ప్రత్యేక పూజలు, హారతి సమర్పించి వేడుకలను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని దర్శించుకుని, లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక అర్చనలు నిర్వహించారు.

పుష్కరాల ప్రారంభోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ప్రభుత్వ తరఫున నదీమతకు పట్టువస్త్రాలు సమర్పించారు.ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల మౌలిక వసతులు, ఘాట్ల వద్ద భద్రతా చర్యలు ముందస్తుగానే పూర్తి చేసినట్లు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన కాళేశ్వరంలో ఈ వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇవాళ సాయంత్రం 4 గంటలకు గౌరవ తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల కాళేశ్వరం చేరుకోనున్నారు. ఆయన త్రివేణి సంగమ తీరాన్ని సందర్శించి, పుష్కర స్నానం ఆచరించిన అనంతరం స్వామివారి దంపతులను దర్శించుకోనున్నారు. బృహస్పతి (గురుడు) ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశించే క్రమంలో అంత్య పుష్కరాలు జరుగుతాయి. సరస్వతీ నదికి జరుగుతున్న ఈ అంత్య పుష్కరాల కాలంలో లక్ష్మీనరసింహ, కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రమైన ఈ త్రివేణి సంగమంలో స్నానం ఆచరిస్తే సకల పాపాలు తొలగి, పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ 12 రోజుల పాటు భక్తుల రద్దీ భారీగా ఉండే అవకాశం ఉండటంతో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా నడుపుతోంది.

Also Read:పొగాకు లంగ్స్‌కే కాదు..!

- Advertisement -