యంగ్ ఛార్మింగ్ హీరో శింబు హీరోగా అందాల తారలు నయనతార, ఆండ్రియా, ఆదాశర్మ హీరోయిన్స్‌గా ‘ప్రేమసాగరం’ టి.రాజేందర్ సమర్పణలో శింబు సినీ ఆర్ట్స్ అండ్ జేసన్‌రాజ్ ఫిలింస్ బేనర్స్‌పై పాండిరాజ్ దర్శకత్వంలో తమిళ్, తెలుగు భాషల్లో టి.రాజేందర్ నిర్మించిన చిత్రం ‘సరసుడు’. ఈ చిత్రం తమిళంలో ‘ఇదు నమ్మ ఆళు’ పేరుతో రిలీజై 27 కోట్లకు పైగా కలెక్ట్ చేసి శింబు కెరీర్‌లోనే నెంబర్‌వన్ హిట్‌గా నిలిచింది. డీమానిటైజేషన్ ప్రాబ్లెమ్ వల్ల తెలుగులో రిలీజ్ ఆలస్యం అయ్యింది. ప్రస్తుతం తెలుగు వెర్షన్‌కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి ఈనెలలోనే సమ్మర్ కానుకగా ‘సరసుడు’ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. శింబు సినీ ఆర్ట్స్‌లో ‘కుర్రాడొచ్చాడు’ తర్వాత డైరెక్ట్ రిలీజ్ అవుతున్న తెలుగు చిత్రం ఇది. ఈ చిత్రానికి శింబు సోదరుడు టి.ఆర్.కురళరసన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ఆడియో రిలీజ్ కార్యక్రమం మే 2న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా రిలీజ్ అయ్యింది. ఈ కార్యక్రమానికి రాకింగ్ స్టార్ మంచు మనోజ్, లవర్‌బోయ్ శింబు, యువ నటుడు మహత్ రాఘవేంద్ర, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్, నిర్మాత ఎస్.కె.బషీర్, నల్గొండ డి.సి.బి. బ్యాంక్ ఛైర్మన్ జె.వి.ఆర్., రచయిత బోస్ గోగినేని పాల్గొన్నారు. అతిథులందరికీ నిర్మాత టి.రాజేందర్ ఫ్లవర్ బొకేలతో స్వాగతం పలికారు.
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ‘సరసుడు’ బిగ్ సీడిని లాంచ్ చేయగా, ఆడియో సీడిలను నిర్మాత టి.రాజేందర్ రిలీజ్ చేసి తొలి సీడిని శింబుకి అందించారు. లహరి మ్యూజిక్ ద్వారా ఆడియో రిలీజ్ అయ్యింది. కార్యక్రమానికి ముందు ‘సరసుడు’ చిత్రంలోని పాటలను స్క్రీన్‌పై ప్రజెంట్ చేశారు.
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ మాట్లాడుతూ – ”బాహుబలి-2’లాంటి గొప్ప సినిమాని రాజమౌళి తీసినందుకు మనందరం గర్వించదగ్గ విషయం. నా ప్రాణ స్నేహితుడు శింబు, నేను చిన్నప్పటి నుండి చెన్నైలో 6 స్టాండర్డ్స్ నుంచి కలిసి పెరిగాం. మా ఇద్దరికీ మ్యూజిక్ అంటే బాగా ఇష్టం. నా సినిమాలో మ్యూజిక్ బాగా వస్తుందన్నా, నాకు మ్యూజిక్ టేస్ట్ వుండటానికి కారణం శింబు. చిన్నప్పట్నుంచి చాలా ఇన్‌స్పైర్ చేశారు. పాటలు రాయడం.. పాడటం, మ్యూజిక్ చేయడంలో అమేజింగ్ టాలెంట్ వుంది శింబుకి. అలాగే ఎక్స్‌లెంట్ పెర్‌ఫార్మెర్. డ్యాన్స్‌లో కూడా ఈ సినిమాలో ఇరగదీసాడు. నా ఫ్రెండ్ శింబు సినిమా ఆడియో లాంచ్ చేయడం నిజంగా నాకు చాలా హ్యాపీగా వుంది. ఎవర్‌గ్రీన్ హీరో టి.రాజేందర్‌కి ఈరోజుకి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఈ వయసులో కూడా ఫుల్ ఎనర్జిటిక్‌గా వుంటారు. ఆయన ఒక మాస్ సాంగ్‌ని ఓ రేంజ్‌లో పాడారు. తండ్రి పాట పాడటం, కొడుకు డ్యాన్స్ చేయడం చాలా థ్రిల్లింగ్‌గా వుంది. శింబు మూవీస్ అంటేనే మ్యూజిక్‌కి ప్రాధాన్యత వుంటుంది. ప్రతి పాట ఆణిముత్యంలా ఎక్స్‌లెంట్‌గా వుంటుంది. ఈ చిత్రానికి కురళ్‌ని మ్యూజిక్ డైరెక్టర్‌గా లాంచ్ చేశారు. తమిళంలో అద్భుతంగా సూపర్‌హిట్ అయ్యాయి. ఇంత మంచి పాటల్ని నేను రిలీజ్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. సినిమా గొప్ప హిట్ అయ్యి, తెలుగులో వరసగా శింబు సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. నేను, శింబు కలిసి త్వరలో మంచి యాక్షన్ సినిమాని తెలుగు, తమిళ్ బైలాంగ్వేజ్ ఫిల్మ్‌గా తీయబోతున్నాం. శింబు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని ఆశిస్తూ.. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్” అన్నారు.
ప్రముఖ నిర్మాత ఎస్.కె.బషీర్ మాట్లాడుతూ – ”రీసెంట్‌గా చెన్నైలో రాజేందర్ ఇంటికెళ్ళినప్పుడు ఆయన బాగా మర్యాదపూర్వకంగా రిసీవ్ చేసుకున్నారు. అప్పుడు ఈ చిత్రంలోని పాటలను పాడి వినిపించారు. ఫుల్ జోష్‌తో ఎనర్జిటిక్ పాటలు పాడారు. ఆయన బాడీ అలాగ సినిమా వైబ్రేషన్‌తోనే నిండి పోయి వుంటుంది. ‘ప్రేమసాగరం’తో ఆయన ఒక సెన్సేషన్ సృష్టించారు. ఈ సినిమాలో మరో సూపర్‌హిట్ సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
లవర్‌బోయ్ శింబు మాట్లాడుతూ – ”తెలుగు ఇండస్ట్రీలో నాకు చాలామంది ఫ్రెండ్స్ వున్నారు. నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఎంతోమంది ఆప్యాయంగా పలకరిస్తూ ప్రేమగా చూసుకుంటారు. కానీ ప్రాణ స్నేహితుడు మాత్రం ఒక్కడే మనోజ్. వందమంది కన్నా ఎక్కువ అతను. ఫ్రెండ్‌షిప్ అనేది వెరీ ఇంపార్టెంట్. చిన్న ఆడియో ఫంక్షన్ అయినా మనోజ్ రాకతో ఇది పెద్ద ఫంక్షన్ అయిపోయింది. నా మీద ప్రేమతో వచ్చినందుకు మనోజ్‌కి నా మనస్ఫూర్తిగా థాంక్స్. తెలుగులో నా సినిమాలు రిలీజ్ అయి చాలాకాలం అయ్యింది. ‘మన్మథ’, ‘వల్లభ’ తర్వాత చాలామంది ఎందుకు తెలుగులో చెయ్యడం లేదు అని అడుగుతున్నారు. పాండిరాజ్ మరో లవ్‌స్టోరి చెప్పారు. నయనతార, ఆండ్రియా ఎక్స్‌లెంట్‌గా పెర్‌ఫార్మ్ చేశారు. మా బ్రదర్ కురళ్ అరసన్ మ్యూజిక్ చేశారు. మా ఫాదర్ అండ్ మదర్ ఈ చిత్రాన్ని నిర్మించడం చాలా సంతోషంగా వుంది. సత్యం రాజేష్ త్రూ అవుట్ క్యారెక్టర్ చేశాడు. డైలాగ్స్ విషయంలో నాకు బాగా హెల్ప్ చేశారు. రాజేష్‌కి థాంక్స్. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది” అన్నారు.
యంగ్ హీరో మహత్ రాఘవేంద్ర మాట్లాడుతూ – ”శింబు ఫాదర్ టి.రాజేందర్ చాలా కష్టపడి ఈ సినిమాకి వర్క్ చేశారు. మాటలు, పాటలు రాయడమే కాకుండా ఒక సాంగ్ కూడా పాడారు. సినిమాకి బాగా పబ్లిసిటీ చేసి ప్రమోట్ చేస్తున్నారు. నిజంగా ఆయన చాలా గ్రేట్ పర్సన్. శింబుకి గురువు రాజేందర్ అయితే, నాకు గురువు శింబు. యాక్టింగ్, డ్యాన్స్ అన్ని విషయాల్లో ఆయన దగ్గరే నేర్చుకున్నాను. తెలుగు ప్రేక్షకులు చాలా ప్రేమా, అభిమానంగా ఆదరిస్తారు అని శింబు చెప్పారు. ఈ సినిమా సూపర్‌హిట్ అయి తెలుగులో శింబుకి పెద్ద బ్రేక్ రావాలి” అన్నారు.
రచయిత, నటుడు, దర్శకుడు, నిర్మాత టి.రాజేందర్ మాట్లాడుతూ – ”1983లో ‘ప్రేమసాగరం’ చిత్రం రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయిన అన్ని సెంటర్స్‌లో రికార్డ్ కలెక్షన్స్‌తో వన్ ఇయర్ ఆడింది. ఆ సినిమా అప్పుడు నన్ను ఆదరించారు. ‘ప్రేమ సామ్రాజ్యం’, ‘మైధిలీ నా ప్రేయసి’, ‘నా చెల్లెలు కళ్యాణి’, ‘హలో మైడియర్ మోనిషా’ ఎన్నో సూపర్‌హిట్ చిత్రాల్లో నటించి డైరెక్షన్ చేశాను. శింబు సినీ ఆర్ట్స్ బేనర్ స్థాపించి ‘కుర్రాడొచ్చాడు’ చిత్రంతో శింబుని హీరోగా లాంచ్ చేశాం. మళ్ళీ అదే బేనర్‌లో ‘సరసుడు’ చిత్రాన్ని తెలుగులో నిర్మించాం. ఈ సినిమాకి మాటలు, పాటలు నేనే రాశాను. మా చిన్నబ్బాయి కురళ్ అరసన్ మ్యూజిక్ చేశాడు. మనోజ్ చాలా సపోర్ట్ చేసి ఆడియో రిలీజ్‌కి వచ్చారు. నన్ను, శింబుని ఆదరించారు. ఇప్పుడు మా అబ్బాయి కురళ్ అరసన్‌ని సంగీత దర్శకుడిగా ఆదరించాలని కోరుకుంటున్నాను. శింబుని హీరోగా నేను ఇంట్రడ్యూస్ చేశాను. మా కురళ్‌ని మ్యూజిక్ డైరెక్టర్‌గా శింబు ఇంట్రడ్యూస్ చేశారు. ఆ క్రెడిట్ అంతా శింబుకే దక్కుతుంది. మోహన్‌బాబు నాకు ఫ్రెండ్ మాత్రమే కాదు.. ఆయనకి నేను పెద్ద ఫ్యాన్. నాకు గురువు దాసరి నారాయణరావు. ఆయన డైలాగ్ డిస్టింక్షన్ అంటే నాకు చాలా ఇష్టం. ఏ పని చేసినా కసితో, ప్యాషన్‌తో చేస్తారు. చేసే పని అంటే నాకు ఒక ధ్యాస.. ఇంకా చెప్పాలంటే అది నా శ్వాస. దేవుడి దయతో మాట్లాడాలంటే వస్తుంది ఈ ప్రాస. తెలుగు ఆడియన్స్ క్లాసా.. మాసా.. అనేది నాకు ఒక అవగాహన వుంది. ఈ చిత్రంలో 5 పాటలున్నాయి. ఒక్కొక్క సాంగ్ వెరైటీగా వుంటుంది. ఈ చిత్రంలో శింబు మెలోడీ సాంగ్ పాడారు. తెలుగు, తమిళ్ బైలాంగ్వేజ్‌లో ఈ చిత్రాన్ని నిర్మించాం. శింబు సినీ ఆర్ట్స్‌లో ‘కుర్రాడొచ్చాడు’ సినిమా తర్వాత డైరెక్ట్‌గా రిలీజ అవుతున్న తెలుగు సినిమా ఇది. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ చిత్రాన్ని ఆదరించి చాలా పెద్ద హిట్ చెయ్యాలని కోరుకుంటున్నాను” అన్నారు.
తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ – ”ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్‌లో నిర్మించారు. కురళ్ అద్భుతమైన సాంగ్స్ కంపోజ్ చేశారు. ఈ చిత్రం శింబుకి మరొక ‘మన్మథ’ కావాలి. యూత్‌లో శింబుకి మంచి ఫాలోయింగ్ వుంది. ఖచ్చితంగా ఈ సినిమా యూత్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటోంది. రాజేందర్‌తో పది సంవత్సరాలుగా మంచి పరిచయం వుంది. ‘ప్రేమసాగరం’ సినిమాతో ఆయన సెన్సేషన్ సృష్టించారు. మళ్లీ ఈ సరసుడు సినిమాతో మరో హిట్‌ని సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.