తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉద్యోగుల భద్రత, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, ప్రమాద బీమా పథకాన్ని మరింత విస్తరించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ పథకం కింద ప్రభుత్వ ఉద్యోగులకు రూ.1.02 కోట్ల ప్రమాద బీమా అందించనున్నారు. విధి నిర్వహణలో గానీ, ఇతర సందర్భాల్లో గానీ దురదృష్టవశాత్తు ప్రమాదం సంభవించినప్పుడు ఉద్యోగి కుటుంబానికి ఈ భారీ మొత్తంలో బీమా రక్షణ లభించనుంది.
ఈ ప్రమాద బీమా పథకాన్ని అమలులోకి తీసుకురావడానికి ప్రముఖ బ్యాంకర్లతో ప్రభుత్వం ఇప్పటికే చర్చలు పూర్తి చేసింది. బీమా కవరేజ్, ప్రీమియం చెల్లింపులు, క్లెయిమ్ విధానం వంటి అంశాలపై స్పష్టత వచ్చినట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ చేసి పథకాన్ని అమలు చేయనున్నారు.
ఇప్పటికే సింగరేణి కాలరీస్ కంపెనీ ఉద్యోగులు, ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, జెన్కో వంటి విద్యుత్ సంస్థల ఉద్యోగులకు రూ.కోటి కంటే ఎక్కువ ప్రమాద బీమా అమలులో ఉంది. సింగరేణిలో సుమారు 38 వేల మంది ఉద్యోగులు, విద్యుత్ సంస్థల్లో 71,387 మంది ఉద్యోగులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు.
తాజా నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5.14 లక్షల ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ఈ ప్రమాద బీమా వర్తించనుంది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ నిర్ణయం ఉద్యోగుల్లో ఆనందాన్ని నింపుతూ, వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించనుందని ప్రభుత్వం భావిస్తోంది.
Also Read:మద్యం సీసాలపై కూటమి తప్పుడు ప్రచారం!

