రివ్యూ: శమంతకమణి

459
Samanthakamani review
- Advertisement -

‘భలే మంచిరోజు’ చిత్రంతో తొలి విజయాన్ని అందుకున్న దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య రెండో ప్రయత్నంగా తెరకెక్కించిన చిత్రం ‘శమంతకమణి’. నలుగురు యువ కథానాయకులు నారా రోహిత్ , సందీప్ కిషన్, ఆది సాయికుమార్, సుధీర్ బాబు హీరోలుగా తెరెకెక్కిన మల్టీస్టారర్ మూవీ ‘శమంతకమణి’ అభిమానుల అంచనాల మధ్య శుక్రవారం విడుదలైంది. ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే..

కథ:
కృష్ణ(సుధీర్‌ బాబు) డబ్బు, పలుకుబడి ఉన్న వ్యక్తి.. హంగు ఆర్బాటాలతో విలాసంగా గడిపేస్తుంటాడు.. ఓసారి హైదరాబాద్‌లో పెద్ద పార్టీ ఇస్తాడు. ఆ పార్టీలో శమంతకమణి అనే కారును ఎవరో దొంగతనం చేస్తారు.. కారు విలువ ఐదు కోట్ల రూపాయాలు.. కారును ఎవరు దొంగిలించారో తెలుసుకోవడానికి ఇన్‌స్పెక్టర్‌ రంజిత్‌కుమార్‌ (నారారోహిత్‌) రంగంలోకి దిగుతాడు.. శమంతకమణి కోసం విచారణ ప్రారంభిస్తాడు. ఆ పార్టీకి వచ్చిన వారిలో ముగ్గురు అనుమానితులను గుర్తిస్తారు. వారిలో ఉమామహేశ్వరరావు(రాజేంద్రప్రసాద్‌), శివ(సందీప్‌ కిషన్‌), కార్తీక్‌(ఆది). వీళ్ల లక్ష్యం ఒకటే.. ఏదో ఒకటి చేసి లైఫ్‌లో సరిపడా డబ్బులు సంపాదించాలన్నదే.. ఇక ఇన్‌స్పెక్టర్‌ రంజిత్‌కుమార్‌ కూడా ఉద్యోగం ద్వారా వచ్చే జీతంతో సరిపోక.. ఎదో ఒకటి చేయాలనుకుంటాడు. మరి ఈ నలుగురిలో కారు ఎవరు దొంగలించారన్నదే ‘శమంతకమణి’ కథ.

ప్లస్ పాయింట్స్‌:
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే నలుగురు హీరోలు.. రాజేంద్రప్రసాద్‌ పాత్రలకు పాత్రలకు ప్రాధాన్యం ఇవ్వడంలో దర్శకుడు శ్రీ రామ్ ఆదిత్య సక్సెస్ అయ్యాడు. కారు పోయిన పాయింట్‌తో కథ మొదలవుతుంది. సెకండాఫ్‌తో కథ వూపందుకుంటుంది. సుధీర్‌బాబు పాత్ర భావోద్వేగంతో కూడిన పాత్ర. సందీప్‌కిషన్‌, ఆది పాత్రలు సరదాగా సాగిపోతాయి. క్రైం బ్రాంచ్ పోలీస్‌గా నారారోహిత్‌ పాత్ర కథకు కీలకం. రాజేంద్రప్రసాద్‌- ఇంద్రజ మధ్య వచ్చే లవ్‌ ట్రాక్‌ నవ్వులు పూయిస్తుంది. ఇలా కథకు తగిన పాత్రలను ఎంచుకోవడంతోనే దర్శకుడు సగం విజయం సాధించాడు. కానిస్టేబుల్ గా చేసిన రఘు కామెడీ కూడా నవ్వించింది మిగిలిన పాత్రలు వారి పరిధి మేర నటించారు.

 Car

మైనస్‌ పాయింట్స్‌:

ఫస్ట్‌ హాఫ్‌ పాత్రల పరిచయం కోసమే అన్నట్టు సాగుతుంది. కొన్ని సన్నివేశాలు అనవసరం అనిపిస్తాయి. తొలి భాగాన్ని ఇంకాస్త పదునుగా.. ఎంటర్‌టైన్‌మెంట్‌తో తీర్చిదిద్ది ఉంటే బాగుండేది. సినిమాలో ఒకే ఒక పాటకు మాత్రమే పరిమితం అయ్యాడు దర్శకుడు. ప్రథమార్ధాన్ని ఫ్లాట్‌గా చూపించిన దర్శకుడు.. మలుపులన్నీ క్లైమాక్స్‌ కోసం అట్టిపెట్టుకున్నాడు. చిత్ర క్లైమాక్స్ బాగానే ఉన్నప్పటికీ కాస్త రొటీన్ గా తోచడంతో పెద్దగా ఎగ్జైట్మెంట్ కలుగలేదు. ఇక మొదటిసారి సినిమా చూసి ట్విస్ట్ తెలుసుకున్న ప్రేక్షకుడికి రెండవసారి సినిమా చూడటానికి కనీస కారణాలు కూడా దొరకవు.

సాంకేతిక విభాగం:

‘భలే మంచిరోజు’ చిత్రంతో తొలి విజయాన్ని అందుకున్న దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య రెండో ప్రయత్నంలో సక్సెస్‌ అయ్యాడని చెప్పొచ్చు. క్లైమాక్స్‌కు ముందు వచ్చే ట్విస్ట్‌ బాగుంటుంది. అసలు దర్శకుడు కథ మొత్తం ఇందుకోసమే రాసుకున్నాడేమో అనిపిస్తుంది. మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం ప్రేక్షకుడిని కథలో లీనమయ్యేలా చేస్తుంది. సాంకేతికంగా చూస్తే సమీర్‌రెడ్డి కెమేరా పనితనం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

Shamanthakamani-Movie-Stills-05

తీర్పు:
నలుగురు హీరోలు కలిసి చేసిన ఈ మల్టీ స్టారర్ చిత్రం కాబట్టి ఆసక్తికరంగా అనిపిస్తుంది. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య రాసిన సెకండాఫ్ స్క్రీన్ ప్లే క్లైమాక్స్ ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు.. కాగా స్లో నేరేషన్, ఫస్ట్‌ హాఫ్‌ నెమ్మదిగా ఉండడం.. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఆఖరు వరకు కారు దొంగతనం విషయాన్ని తేల్చకుండా కారు దొంగతనం ఎలా జరిగింది, ఎవరు చేసుంటారు అనే ప్రశ్నలను పదే పదే సినిమా చూస్తున్న ప్రేక్షకుల మెదళ్లలో మెదిలేలా చేసి సినిమాపై దాదాపు చివరి దాకా ఆసక్తిని నిలిపి ఉంచాడు. సినిమా స్టోరీ తెలియకపోతే ‘శమంతకమణి’ ని చూడొచ్చు.

విడుదల తేదీ: 14/07/2017
రేటింగ్ : 3/5
నటీనటులు : నారా రోహిత్, సందీప్ కిషన్, సుధీర్ బాబు, ఆది సాయికుమార్
సంగీతం : మణి శర్మ
నిర్మాత : ఆనంద్ ప్రసాద్
దర్శకత్వం : శ్రీరామ్ ఆదిత్య

- Advertisement -