పెళ్లయ్యాక నాగచైతన్య, సమంత తొలిసారి కలసి నటించబోతున్నారు. ఈ వార్త ఎప్పుడో తెలిసినా.. ఇప్పుడు అధికారికంగా ధృవీకరించాడు నాగచైతన్య. ‘నిన్నుకోరి’తో ఆకట్టుకున్న శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకుడు. షైన్ స్క్రీన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాతలు. ఈ చిత్రానికి ‘ప్రేయసి’ అనే పేరు పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈ సినిమాకి సంబంధించి టైటిల్ ఇంకా డిసైడ్ చేయలేదట. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు నాగచైతన్య.
‘‘’షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై శివ దర్శకత్వంలో కొత్త సినిమా చేయబోతున్నాను. ఈ సినిమాలో నా బెటర్ హాఫ్ సమంతతో స్క్రీన్ షేరు చేసుకుంటున్నందుకు(తను ఏమైనా ఛాన్స్ ఇస్తే) చాలా సంతోషంగా ఉంది. ప్రేమలో మరో ప్రయాణం ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని చెప్పాడు చైతు. తన తదుపరి సినిమాలపై వస్తున్న వార్తలు నమ్మొద్దంటూ.. ఏదైనా ఉంటే తానే ప్రకటిస్తానని గత నెల 22న చైతూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాను చెప్పినట్లుగానే చైతూ తన తదుపరి సినిమా గురించి ట్వీట్ చేశాడు. సమంతతో వివాహం తర్వాత ఇద్దరూ కలిసి చేస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం.