జ‌గ‌న్‌ను క‌లిసిన సాల్మ‌న్ కుటుంబం

3
- Advertisement -

ఇటీవల పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త మందా సాల్మన్ టీడీపీ నాయకుల దాడిలో హత్యకు గురైన నేపథ్యంలో, ఆయన కుటుంబ సభ్యులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సాల్మన్ కుమారులు, కుమార్తె జగన్‌ను కలిసి తమ బాధను వెల్లబోసుకున్నారు.

మందా సాల్మన్‌పై ఇటీవల ఇనుప రాడ్డుతో దాడి జరగగా, తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. పిన్నెల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకుల బెదిరింపుల కారణంగా సాల్మన్ కుటుంబంతో కలిసి గ్రామాన్ని విడిచి వెళ్లాల్సి వచ్చిందని వైసీపీ ఆరోపిస్తోంది.

ఇటీవల కుటుంబ సభ్యులను చూసేందుకు సాల్మన్ తిరిగి పిన్నెల్లి గ్రామానికి వెళ్లిన సమయంలో, “నీకు ఎంత ధైర్యం ఉంటే మా ప్రభుత్వంలో గ్రామంలోకి వస్తావా?” అంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ నాయకుడు ఆయనపై దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ దాడిలో సాల్మన్ తీవ్రంగా గాయపడగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

Also Read:ఓం శాంతి శాంతి శాంతిః.. ఫన్ డ్రామా!

ఈ ఘటనపై జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో రాజకీయ హింస పెరుగుతోందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన వ్యాఖ్యానించారు.

- Advertisement -