జపాన్‌లోని ఐచి-నాగోయా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 పోటీలలో భారత బాక్సర్ సాక్షి చౌదరి సంచలన విజయంతో బోణీ చేసింది. మంగళవారం నాటి మహిళల 51 కేజీల విభాగం తొలి రౌండ్ (రౌండ్ ఆఫ్ 32) పోరులో పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, ఫిలిప్పీన్స్‌కు చెందిన ఐరా విల్లెగాస్ను సాక్షి మట్టికరిపించింది.
ఆద్యంతం ఏకపక్షంగా సాగిన ఈ బాక్సింగ్ బౌట్లో సాక్షి 5-0 తేడాతో ఏకగ్రీవ నిర్ణయంతో ఘనవిజయం సాధించి, ప్రీ-క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది.
ఆరంభం నుంచే దూకుడు: రెడ్ కార్నర్ నుంచి బరిలోకి దిగిన సాక్షి ఆరంభం నుంచే పంచ్‌లతో ప్రత్యర్థిపై విరుచుకుపడింది. తన ఎత్తు, సుదీర్ఘమైన రీచ్‌ను అనుకూలంగా మార్చుకుంటూ పవర్ ఫుల్ జాబ్స్, పంచ్‌లు విసిరింది. ఐదుగురు జడ్జీలు కూడా తొలి రౌండ్ నుంచి చివరి వరకు భారత్‌కే అనుకూలంగా 5-0 సంపూర్ణ ఆధిక్య పాయింట్లు ఇచ్చారు.
ఇవాళ సాక్షి చౌదరి తన 23వ పుట్టినరోజును జరుపుకుంటోంది. తన బర్త్‌డే నాడే పారిస్ ఒలింపిక్స్ మెడలిస్ట్‌పై విజయం సాధించి ఘనమైన కానుకను అందుకుంది.
Also Read:విద్యార్థులతో సీఎం విజయ్ బ్రేక్‌ఫాస్ట్
ఇటీవల గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం గెలుచుకోవడంతో పాటు వరల్డ్ బాక్సింగ్ కప్‌లోనూ పసిడి నెగ్గిన సాక్షి ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో ఉంది. రాబోయే ప్రీ-క్వార్టర్స్ (రౌండ్ ఆఫ్ 16) పోరులో కజకిస్తాన్‌కు చెందిన అలువా బాల్కిబెకోవాతో గురువారం నాడు తలపడనుంది.

