కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయవేడి పులుముకుంది. ఒకరిపై ఒకరి విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. మీడియాతో మాట్లాడుతూ.. నటుడు సాయి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం సిద్దరామయ్య ఓ అసమర్థ సీఎం అని ఇంతవరకు ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదని విమర్శించారు. ఈ సారి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో బీజీపీ విజయ కేతనం ఎగురవేస్తుందన్నారు. నా తోటి నటుడు ప్రకాష్ రాజ్ ఆవేపరుడంటూ వ్యాఖ్యానించారు. దేశంలో ఏం జరిగినా.. ప్రధాని మోడీని నిందించడం ప్రకాష్‌రాజ్‌కి, ప్రతిపక్ష పార్టీలకి అలవాటైందన్నారు. అందుకే ప్రకాష్‌రాజ్ తనకు నచ్చలేదని తెలిపారు.
మరోవైపు ఏపీ తెలుగుదేశం నేతలు రాజకీయంగా సహనం కోల్పోయి మాట్లాడుతున్నారు. అమరావతి శంకుస్థాపన సందర్భంగా పవిత్ర జలం.. పవిత్ర మట్టి అంటూ మోడీని కీర్తించిన టీడీపీ నేతలు, నేడు విమర్శించడంలో తగదన్నారు. ఏపీ టీడీపీ నేతలు వైఎస్ జగన్‌ని ఫాలో అవుతున్నారని, రాజకీయ పార్టీకి సొంత ఆలోచనలు, విధానాలు ఉండాలని టీడీపీ నేతలకు సాయికుమార్ ఎద్దేవచేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ రాజీలేని పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో నటుడు సాయి కుమార్ బీజేపీ తరపున బాగేపల్లి నుంచి పోటీ చేస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికలలోనూ బీజేపీ తరపున సాయి కుమార్ బాగేపల్లి నియోజక వర్గంలో పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి బాగేపల్లి నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు సాయికుమార్.