ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ ‘జవాన్’ సినిమాలో నటిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఇప్పటికే టాకీ పార్టు పూర్తిచేసుకుని షూటింగ్ చివరి షెడ్యూల్ కి సిద్దమవుతుంది. గతంలో విడుదలైన జవాన్ ప్రీలుక్ పోస్టర్, టైటిల్,ఫస్ట్ లుక్ పోస్టర్ కి చాలా మంచి స్పందన వచ్చింది.
అయితే సాయిధరమ్ తేజ్ ఇంతకుముందు చేసిన రెండు సినిమాలు పరాజయం పాలుకావడంతో, ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో వున్నాడు. అందువల్లనే ‘జవాన్’ వంటి పవర్ఫుల్ సబ్జెక్ట్ ను ఎంచుకున్నాడు. బీవీఎస్ రవి దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా, పెద్దగా గ్యాప్ తీసుకోకుండా చకచకా షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఇప్పుడు సాయిధరమ్ తేజ్ ఈ సినిమాలో తన పాత్రకి డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు. అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందని సన్నిహితులతో చెప్పి సంతోష పడుతున్నాడట. ఆగస్టు చివరినాటికి ఈ సినిమాకి సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసి, సెప్టెంబర్ 1వ తేదీన సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. మెహ్రీన్ కౌర్ కథానాయికగా అలరించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ ఇటు తేజూకి .. అటు దర్శకుడు బీవీఎస్ రవికి కూడా చాలా అవసరమనే చెప్పాలి.