అమెరికా బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు కోబ్ బ్రయంట్(41) ఆదివారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదంలో కోబ్ బ్రయంట్, ఆయన కుమార్తె సహా 9 మంది మరణించారు. ఆయన వ్యక్తిగత హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం ఏర్పడడం వల్లే ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ఫోర్బ్స్ ప్రకటించిన అత్యధిక ధనవంతుల క్రీడాకారుల జాబితాలో బ్రయంట్ చాలా సార్లు తన పేరును నిలుపుకున్నాడు.
బ్రయంట్ మృతిపట్ల విషాదం నెలకొంది. ఆయనకు పలువురు సంతాపం వ్యక్తం చేయగా బీసీసీఐ ఇవాళ సంతాపం ప్రకటించింది. బ్రయంట్ ఆత్మకు శాంతి చేకూరాలని ట్విట్ చేసింది.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా తన ట్విట్టర్ ద్వారా బ్రయంట్‌కు నివాళి అర్పించారు. కోబ్ బ్రయంట్ మృతి విషాదాన్ని మిగిల్చింది.. ఆయన కుటుంబసభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు సంతాపం తెలుపుతున్నట్లు సచిన్ పేర్కొన్నారు.
లాస్ ఏంజిల్స్ లేకర్స్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహించిన బ్రయంట్ 2016 ఏప్రిల్‌లో రిటైర్ అయ్యాడు. 2008లో ఎన్‌బీఏ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు గెలుచుకున్నాడు. రెండుసార్లు ఎన్‌బీఏలో స్కోరింగ్ చాంపియన్‌గా నిలిచాడు.