నేడు శబరిమలలో అయ్యప్ప ఆలయ ద్వారాలు తెరవనున్నారు. మంగళవారం శ్రీచిత్తర తిరువాల్ ఉత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం సాయంత్రం అయ్యప్ప ఆలయాన్ని తెరవనున్నారు. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది. అన్ని వయసుల మహిళలను స్వామి దర్శనానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక ఆలయాన్ని తెరవడం ఇది రెండోసారి.
సుప్రీం తీర్పు నేపథ్యంలో పలువురు మహిళలు గత నెలలో మాస పూజ సందర్భంగా స్వామిని దర్శించుకోవడానికి రావడం, వారిని పలు హిందూ సంస్థలు అడ్డుకోవడంతో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. హిందూ ధర్మ పరిరక్షణ సంఘాలు మరోసారి హెచ్చరించడంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. 2,300 మంది పోలీసులతో భద్రతా చర్యలు చేపట్టింది. పంబ, నీలక్కల్, ఎలవుంకల్, సన్నిధానం పరిసరాల్లో 72 గంటలపాటు 144 సెక్షన్ విధించింది.
శబరిమలలో అయ్యప్ప ఆలయం వద్ద 20 మంది ప్రత్యేక కమెండోలు, 100 మంది మహిళా పోలీసులు ఉన్నారు. అవసరమైతే ఆలయ సన్నిధానంలో 50ఏండ్ల పైబడిన 30 మంది సర్కిల్ ఇన్‌స్పెక్టర్ స్థాయి, 50మంది ఎస్సై స్థాయి మహిళా అధికారులు రంగంలోకి దిగుతారు అని ఎస్పీ చెప్పారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు నీలక్కల్ మార్గంలో బారికేడ్లను ఏర్పాటుచేసినట్లు ఆయన చెప్పారు.
మంగళవారం ఆలయ ప్రధాన తంత్రి కందరారు రాజీవరు, ప్రధాన పూజారి ఉన్నికృష్ణన్ నంబూద్రి కలిసి ఆలయ గర్భగుడి ద్వారాలను తెరువనున్నారు. ట్రావెన్‌కోర్ రాజవంశపు చివరిరాజు శ్రీచిత్ర తిరునాల్ బలరామవర్మ జయంతి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, యజ్ఞం నిర్వహిస్తారు. పోలీసుల్లాగే తామూ అన్నివిధాలా సిద్ధంగా ఉన్నామని అయ్యప్ప ధర్మసేన అధ్యక్షుడు రాహుల్ ఈశ్వర్ తెలిపారు.