కోకిలమ్మ పాటల ప్రస్థానం ముగిసింది. దాదాపు 6 శతాబ్ధాల పాటు తన గాత్రంతో సంగీత ప్రియులను అలరించిన జానకమ్మ ఇక పాటలు పాడనంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ది నైటెంగెల్ ఆఫ్ సౌత్ అని అభిమానులు సగర్వంగా పిలుచుకునే జానకమ్మ ఇప్పటివరకు అనేక భాషలలో పాడి మెప్పించారు. 10 కాల్పానికాల్ అనే మలయాళ చిత్రంలోని పాటనే తను పాడే చివరి పాట అని చెప్పడంతో జానకి అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
తమిళమే రాని జానకి మొట్టమొదటిసారిగా తమిళంలోనే పాడారు. అవి రెండూ విషాద గీతాలే. టి.చలపతిరావు సంగీత దర్శకత్వం వహించిన ‘విధియిన్ విళైయాట్టు’ అనే తమిళ చిత్రంలో 4.4.1957న ఆమె తొలిసారిగా ‘పేదై ఎన్ ఆసై పాళా న దేనో’ అనే శోకగీతంతో తన కెరీర్‌ను ప్రారంభించారు. అయితే ఆ చిత్రం విడుదల కాలేదు. 5.4.1957న ‘ఎం.ఎల్.ఎ.’ సినిమా కోసం ఘంటసాలతో కలిసి ‘నీ ఆశ అడియాస… చేయి జారే మణిపూస… బ్రతుకంతా అమవాస లంబాడోళ్ల రాందాసా’ అనే విషాద గీతం పాడారు. ఇది కూడా విషాద గీతం కావడం యాదృచ్ఛికమే. అంతేకాదు ఆమె మలయాళంలో పాడిన తొలి గీతం కూడా శోక గీతమే.
ఆమె పాడటం ప్రారంభించిన తొలి సంవత్సరమే(1957) 6 భాషల్లో 100 పాటలకు పైగా పాడి రికార్డు సృష్టించారు. ఇళయరాజా ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జానకి గురించి మాట్లాడుతూ”జానకమ్మకి తేనె ఖర్చు ఎక్కువ. ఆమె ప్రతిరోజూ కొన్ని లీటర్ల తేనె తాగుతుంటారు. లేకపోతే ఆమె గాత్రంలో అంత మాధుర్యం ఎట్టా వచ్చునప్పా” అని జానకి గాత్రంలోని మాధుర్యం గురించి చమత్కరించారు. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు ఆమె గానంలో మాధుర్యం ఎంతో… ‘సంగీత జానకి’గా సంగీతాన్ని తన ఇంటిపేరుగా మార్చుకున్న అద్భుత గాయనీమణి జానకమ్మ. గాయనిగా, సంగీత దర్శకురాలిగా దాదాపు 15 భాషల్లో 30 వేలకు పైగా పాటలు పాడి నవరసాలు ఒలికించారు. సరికొత్త రికార్డు, ఒరవడిని సృష్టించారు.
1957లో తమిళ సినిమా విదియున్ విళయాట్టుతో గాయనిగా రంగప్రవేశం చేసిన జానకమ్మ 60 ఏళ్లపాటు గాయనిగా కొనసాగుతున్నారు. సుదీర్ఘ సంగీత ప్రయాణంలో దాదాపు భారతీయ భాషలన్నింటిలో పాడిన జానకీ, 4 జాతీయ అవార్డులతో పాటు 32 రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను అందుకున్నారు.
అయితే ఆమె రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో పలు మీడియా సంస్థలు జానకి మరణించినట్టు ప్రచారం చేయటంపై సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ఆరోగ్యంగా ఉన్నారని, కేవలం గాయనిగా కొనసాగటం లేదని మాత్రమే తెలిపారు.