రైతుబంధు ఇప్పట్లో లేనట్లే..?

55
- Advertisement -

డిసెంబర్ మొదటి వారంలోనే విడుదల కావలసిన రైతుబందు నిధులు ఎన్నికల కోడ్ వల్ల అర్ధాంతరంగా హోల్డ్ లోకి వెళ్లిపోయాయి. అయితే రైతులు ఎవరు నిరాశ చెందవద్దని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 తేదీ నాటికి రైతుబంధు నగదు రైతుల అకౌంట్లో జమ అవుతుందని ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత రైతుబంధు విషయంలో ఎలాంటి స్పష్టతనివ్వకుండా దాటవేసే దొరణిలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతుబంధును రైతుభరోసాగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంలో ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. అలాగే వ్యవసాయ కూలీలకు రూ. 12 వేలు, వరి పంటకు అదనంగా రూ.500 ఇస్తామని ప్రకటించింది కాంగ్రెస్.. అయితే అధికారంలోకి వచ్చి ఇరవై రోజులు పూర్తయిన ఇంతవరకు రైతు భరోసా విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. .

అయితే రైతుబంధు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిమితులు విధించే అవకాశం ఉందనే టాక్ కూడా వినిపించింది. అయితే ప్రస్తుతం రైతుబంధులో పరిమితులు, మార్పులు ఉండబోవని, గతంలో అమలు జరిగిన రీతిలో రైతుభరోసా అమలౌతుందని సి‌ఎం రేవంత్ రెడ్డి ఇటీవల చెప్పుకొచ్చారు. అయితే రైతుబంధు నిధుల విడుదలపై రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు. దీంతో రైతుబంధు కోసం ఆశగా ఎదురు చూస్తున్న రైతులకు నిరాశే మిగిలింది. ఇక హామీల అమలు విషయంలో పరిమితులు విధిస్తూ వస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్.. రైతు భరోసా అమలు నాటికి కచ్చితంగా పరిమితులు విధించే అవకాశం ఉందనేది కొందరి అభిప్రాయం. మొత్తానికి అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుబంధు విధుదల చేస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పటికీ కూడా విడుదల చేయకపోవడంతో కాంగ్రెస్ సర్కార్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రైతులు.

Also Read:విషాదం : విజయకాంత్‌ మృతికి కారణం అదే!

- Advertisement -