ఇంటర్ గందరగోళం.. ఇది ఇంటి దొంగల కుట్రే…!

278
ts inter board

తెలంగాణలో ఇంటర్ ఫలితాల వెల్లడి అనంతరం విద్యార్థుల్లో తీవ్ర గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతామని భావించిన విద్యార్థులు ఫెయిల్ కావడం, ధ్రువపత్రాలపై అర్థం లేని సంకేతాలు ఉండటంతో ఆందోళనకు గురయ్యారు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని బద్నం చేయడానికి కుట్రపూరిత ప్రయత్నం జరుగుతోంది.

ఇప్పటికే ఇంటర్‌ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై కమిటీ వేసిన ప్రభుత్వం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనుంది. ఇంటర్ ఫలితాలపై వచ్చిన అపోహల నేపథ్యంలో విద్యార్థులు ఆందోళన చెందవద్దని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్ కోరారు. ఏ ఒక్కరి జవాబు పత్రాలూ గల్లంతు కాలేదని …క్షేత్రస్థాయిలో కొన్ని పొరపాట్లు జరిగాయని, తప్పుచేసినవారికి మెమో జారీచేయడంతోపాటు జరిమానా విధిస్తామని తెలిపారు. తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

ఇక ఈ మొత్తం వ్యవహారంలో ఇంటర్ బోర్డు సెక్రటరీని ఒక ఆట ఆడుకోవాలని నిర్ణయించుకున్న ఓ ముఠా, కక్షగట్టి ఉన్నవీ లేనివీ ప్రచారంలో పెట్టి రచ్చకు రంగం సిద్ధం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే ఇంటర్ బోర్డులో రోజూ పైరవీలు చేస్తూ తిరిగే ముఠాలను అధికార యంత్రాంగం గత ఏడాది కాలంగా బాగా నియంత్రించడమే ఇందుకు కారణం. దీనికి తోడు కార్పొరేట్ కళాశాలలకు అనుకూలంగా ప్రశ్నాపత్రాలు తయారు చేయించే కుట్రలను ఇంటర్ బోర్డు ఈసారి సాగనివ్వలేదు.

దీంతో ఇంటర్ రిజల్ట్స్ వెలువడగానే, వీళ్ళే ముందుగా ఫలితాల ప్రకటనలో ఈసారి ప్రత్యేకంగా ఏదో ఘోరం జరిగిందన్న ప్రచారాన్ని మొదలుపెట్టారు.ఇంటర్ ఫలితాల ప్రకటన సందర్భంగా ప్రతి సంవత్సరం కొంతమంది మార్కులు నమోదు చేయకపోవడం, కొంతమంది మార్కులు తప్పుగా నమోదు చేయడం, కొందరికి వేయాల్సినవి వేయకపోవడం లాంటి అవకతవకలు సర్వసాధారణం. ఇందులో కొత్తేమీ లేదు. ప్రతీసారీ జరుగుతున్నదే. ఇలాంటి తదనంతర పరిణామాలను సరిదిద్దడానికే రీవాల్యుయేషన్, రీ వెరిఫికేషన్ పద్ధతిని చాలా ఏళ్లుగా అమలు చేస్తున్నారు.

గత ఏడాది, అంతకు ముందు ఏడాది కూడా వేలాది మంది విద్యార్థులు తమకు అన్యాయం జరిగిందని రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలియనిది కాదు.దీనిని పెద్దదిగా చూపిస్తూ కోడిగుడ్డు మీద ఈకలు పీకే మాదిరిగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం సరికాదని కొంతమంది వాదిస్తున్నారు. ఎందుకంటే ఇంటర్ బోర్డుకు సంబంధించిన వ్యవహారాలన్నీ ఉన్నతాధికారుల దృష్టికి రాకుండానే పత్రికలకు రావడం ఆ వాదనలకు బలం చేకూరుతోంది. సరిగ్గా ఈ పరిస్థితినే, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు అవకాశంగా తీసుకుని వీధిపోరాటాలు చేస్తున్నాయి.

ఎప్పటిలాగే కొందరు లెక్చరర్లు తప్పులు చేయడం వల్ల ఫలితాల్లో తేడాలు వచ్చాయి అంతే తప్ప ఇందులో ప్రభుత్వాన్ని నిందించడానికి వీసమెత్తు అవకాశం లేదని చెబుతున్నారు. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిటీ త్వరలో నివేదిక ఇవ్వనుండటంతో అసలు దోషులు తప్పించుకోవడం కష్టమే.