వివిధ అంశాలపై ట్విట్టర్ ద్వారా స్పందించే జనసేన పార్టీ సోమవారం చేసిన ట్వీట్ రాజకీయంగా కలకలం రేపింది. వచ్చే ఎన్నికల్లో 175 శాసనసభ స్థానాల్లోనూ జనసేన పోటీ చేస్తుందని పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ పేర్కొన్నట్టుగా జనసేన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. కాసేపటికే దాన్ని తొలగించారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా జనసేన సొంతంగానే అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందన్న భావన కలిగించేలా ఈ ట్వీట్ ఉండటం కలకలానికి కారణమైంది. వివిధ టీవీ ఛానళ్లలోనూ ఈ అంశం విస్తృతంగా ప్రసారమైంది. దీనిపై జనసేన మీడియా ప్రతినిధులు స్పందిస్తూ.. వచ్చే ఎన్నికల్లో ఎన్ని స్థానాలో పోటీ చేయాలన్న అంశంపై ప్రస్తుతం పార్టీలో ఎలాంటి చర్చ జరగడం లేదని, పార్టీ సోషల్ మీడియా గ్రూపులో కొత్తగా చేరిన వ్యక్తి పొరపాటున ఆ విధంగా ట్వీట్ చేశారని తెలిపారు.
‘జనసేన సోషల్‌మీడియా విభాగమైన శతఘ్ని డిజిటల్ రెజిమెంట్ ప్రతినిధుల సమావేశం కొన్ని రోజుల కిందట జరిగింది. దానిలో పవన్‌కల్యాణ్ పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆ ప్రతినిధుల్లో ఒకరు వచ్చే ఎన్నికల్లో జనసేన అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందా? అని అడిగారు. దానికి పవన్‌కల్యాణ్ బదులిస్తూ.. అప్పటి పరిస్థితుల్నిబట్టి, పార్టీ బలాన్ని బట్టి నిర్ణయం తీసుకుందామని బదులిచ్చారు. దాన్నే ఆ బృందంలోని ఒక వ్యక్తి పొరపాటుగా అర్థం చేసుకుని ఇప్పుడు ట్వీట్ చేశారు’ అని తెలిపారు.