ఆర్టీసీ కార్మికులను సమ్మె చేయవద్దని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సమ్మె విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు. మరోవైపు మే 20 నుండి సమ్మె చేస్తున్నట్టు ప్రకటించాయి కార్మిక సంఘాలు.
అశ్వత్థామ రెడ్డి ప్రభుత్వంతో లోపాయకారి ఒప్పందం చేసుకొని సమ్మెను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నాడని, అతని మాటలపై నమ్మకం లేదని తేల్చి చేప్పింది ఆర్టీసీ జేఏసీ. సమ్మె పిలుపులో భాగంగా సోమవారం ఉదయం ఆర్టీసీ కళాభవన్ నుండి బస్ భవన్ వరకు “కార్మిక కవాతు” నిర్వహించారు.
మే 6వ తేదీ రాత్రి వరకు చర్చలకు పిలుపు రాకపోతే, మే 7వ తేదీ ఉదయం నుండి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చి తీరాలని డిమాండ్ చేశారు.
అలాగే మే 20 నుండి సింగరేణిలో సమ్మె సైరన్ మోగనుంది. ఈ నెల 20వ తేదీన సమ్మె చేస్తున్నట్టు సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ సింగరేణి సీఎండికి నోటీసులు అందచేశారు. తమ డిమాండ్ల గురించి చాలా సార్లు యాజమాన్యం దృష్టికి, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకున్న 17 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే సమ్మెను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు.
Also Read:ఓబుళాపురం మైనింగ్ కేసులో తుది తీర్పు

