తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హార్వర్డ్ యూనివర్సిటీ ఇచ్చిన సర్టిఫికేట్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ మాజీ ఐపీఎస్ అధికారి, రాజకీయ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ హార్వర్డ్ యూనివర్సిటీకి ఈ-మెయిల్ పంపారు. దేశంలో ఏ ముఖ్యమంత్రిపై లేనన్ని క్రిమినల్ కేసులు రేవంత్ రెడ్డిపై ఉన్నాయని, మొత్తం 89 కేసులు నమోదయ్యాయని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.
‘ఓటుకు నోటు’ కేసులో ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన రేవంత్ రెడ్డి సుమారు 50 రోజులు జైలులో గడిపిన చరిత్ర ఉందని ప్రవీణ్ కుమార్ గుర్తు చేశారు. అలాంటి వ్యక్తికి హార్వర్డ్ వంటి ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయం సర్టిఫికేట్ ఇవ్వడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుత పాలనలో పలు కుంభకోణాలు చోటుచేసుకుంటున్నాయని, తన రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకార చర్యలకు పాల్పడుతూ తెలంగాణ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి రాజకీయ ప్రత్యర్థులపై అసభ్యకరమైన, అభ్యంతరకరమైన భాషను ఉపయోగించడం తీవ్రంగా ఖండనీయమని అన్నారు.
21వ శతాబ్దానికి రేవంత్ రెడ్డి ఏమాత్రం సరిపడని నాయకుడని, రాతియుగంలో కూడా ఇలాంటి నాయకులు ఉండరని ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో హార్వర్డ్ యూనివర్సిటీ తక్షణమే స్పందించి రేవంత్ రెడ్డికి ఇచ్చిన సర్టిఫికేట్‌ను ఉపసంహరించుకోవాలని ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
Also Read:భారత్‌తో మ్యాచ్ ఆడబోం:పాక్ ప్రధాని

