ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేయడం నేరం కాదని, దేశ రక్షణ కోసం అవసరమైనప్పుడు ట్యాపింగ్ చేయవచ్చని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టంగా చెప్పిన వీడియోను ఆయన మీడియా ముందు ప్రదర్శించారు. భద్రతా కారణాల కోసం పోలీసులు ఫోన్ ట్యాపింగ్ చేస్తారని, అన్ని ప్రభుత్వాలు ఇదే విధానాన్ని అనుసరిస్తాయని ఆయన పేర్కొన్నారు. అయితే, ఎక్కడా దీనిపై పెద్దగా చర్చ జరగడం లేదని విమర్శించారు.
ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గతంలో ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదని వ్యాఖ్యానించారని ప్రవీణ్ కుమార్ గుర్తు చేశారు. అలాంటిది ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి ట్యాపింగ్ అంశంపై కేసులు నమోదు చేయడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం ఈ అంశాన్ని వాడుకుంటున్నారని ఆయన అన్నారు.
అలాగే, నోటుకు ఓటు కేసు సమయంలో సజ్జనార్ ఫోన్ ట్యాపింగ్ చేశాడంటూ అప్పట్లో కేసులు పెట్టిన విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు అదే సజ్జనార్ ఫోన్ ట్యాపింగ్ కేసును విచారిస్తానని చెప్పడం ఆశ్చర్యకరమని విమర్శించారు. రాజకీయ నాయకులను వేధించేందుకు ఏర్పాటు చేసిన సిట్‌కు సజ్జనార్ చీఫ్‌గా ఉండటం సరైంది కాదని అభిప్రాయపడ్డారు.
సజ్జనార్ సిట్‌ను లీడ్ చేస్తూ ట్యాపింగ్ వ్యవహారాన్ని విచారించే నైతిక అర్హత లేదని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి నోటుకు ఓటు కేసులో అరెస్ట్ అయిన సమయంలో సజ్జనార్ SIGగా, ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్నారని గుర్తు చేశారు. అప్పట్లో సజ్జనార్ సహా కొంత మంది అధికారులు తమ ఫోన్లు ట్యాప్ చేశారంటూ ఆంధ్రప్రదేశ్‌లో కేసులు ఉన్నాయని కూడా ఆయన పేర్కొన్నారు.
Also Read:రిటైర్ అయినా వదలం..అధికారులకు హరీష్ హెచ్చరిక

