పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ సర్దార గబ్బర్‌సింగ్ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాను అన్ని ఏరియాల్లోను భారీ రేట్లకు కొన్న బయ్యర్లు నిండా మునిగారు. కొంతమందికి స్వల్ప నష్టాలే వస్తే మరికొందరిక ఊహించని స్ధాయిలో నష్టం వాటిల్లింది. దీంతో బయ్యర్లు రోడ్డున పడ్డారు.
సర్దార్ గబ్బర్‌సింగ్ చిత్రం ద్వారా నైజాం పంపిణీదారు(డిస్ట్రిబ్యూటర్)లకు దాదాపు రూ.8కోట్లు నష్టం వచ్చిందని నైజాం డిస్ట్రిబ్యూటర్ దిలీప్ టాండన్, తరుణ్, డిస్ట్రిబ్యూటర్ల సంఘం ప్రతినిధులు సునీల్, ఉదయ్‌కుమార్‌రెడ్డి, శ్రీనివాస్, సత్యనారాయణ తదితరులు పేర్కొన్నారు. ఈ చిత్రం ద్వారా నష్టపోయిన ఇతర పంపిణీదారులకు నష్టాన్ని చెల్లించిన నిర్మాతలు తమకు మాత్రం చెల్లించడం లేదని ఆరోపించారు.
బుధవారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన పలువురు డిస్ట్రిబ్యూటర్లు మరో చిత్రం కాటమ రాయుడు తక్కువగా ఇచ్చి ఆ నష్టాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన నిర్మాత శరత్ మారర్, పవన్ కల్యాణ్ మేనేజర్ శ్రీనివాస్‌లు ఆ తర్వాత తమకివ్వకుండానే మరో డిస్ట్రిబ్యూటర్‌కు అమ్మారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్దార్ నష్టంపై పవన్ కల్యాణ్ స్పందించి న్యాయం చేయించాలని కోరారు. ఏడాదిగా పవన్‌ను కలిసి ఆవేదనను తెలపాలనుకున్నా అవకాశం లభించడం లేదన్నారు. పవన్ దృష్టికి తీసుకెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు.