చిల్లర కొరతని తీర్చేందుకు కొత్తగా రెండు వందల రూపాయల నోట్లను చలామణిలోకి తెచ్చింది ఆర్బీఐ. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కొత్త రూ. 200, రూ. 50 నోట్లను శుక్రవారం విడుదల చేసింది. దీంతో రూ. 200, రూ. 50 నోట్లు చలామణిలోకి వచ్చాయి. ఢిల్లీలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేదికగా కొత్త నోట్లు అందుబాటులోకి వచ్చాయి. పలువురు ఖాతాదారులు కొత్త నోట్లను విత్‌డ్రా చేసుకునేందుకు ఆర్బీఐ వద్ద బారులు తీరారు. కొత్త నోట్లతో ఫోటోలకు ఫోజులిస్తున్నారు ఖాతాదారులు. దృష్టిలోపం ఉన్న వారు కూడా గుర్తు పట్టేలా కొత్త నోట్లను రూపకల్పన చేశారు.
కొత్తగా విడుదల కానున్న ఈ నోటు పసుపు రంగులో ఉంది. నోటు వెనుక భాగాన భారతదేశ సంప్రదాయ వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా సాంచీ స్తూపం బొమ్మను ముద్రించారు. పెద్ద నోట్ల అక్రమ నిల్వలు, వాణిజ్యానికి కళ్లెం వేయడమే లక్ష్యంగా రూ.200 నోట్లను విడుదల చేసింది ఆర్బీఐ. రూ.100, రూ.500 మధ్య మరో కరెన్సీ నోటు ఇప్పటి వరకూ లేదు. దీంతో రూ.200నోటు మంచి ఆదరణ పొందుతుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది.
మరోవైపు కొత్త రూ. 50 నోటు విడుదల చేయకుండానే బయటకు వచ్చింది. ముంబయిలో ఒక వ్యక్తి వద్ద దీన్ని స్వాధీనం చేసుకున్నారు. మహాత్మ గాంధీ న్యూ సిరీస్‌లో భాగంగా కొత్త రూ. 50 నోటును త్వరలో విడుదల చేయనున్నట్లు గతంలోనే రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. కొత్త రూ. 50 నోటులో వెనకవైపున హంపీ రథం ముద్రించబడి వుంది. నోటు ఫ్లోరెసెంట్ బ్లూ కలర్‌లో వుంది. 66 మీ.మీ+135 మీ.మీ సైజులో వుంది. రూ. 50 నోటుపై ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం ఉంది. కాగా, గత నెలలోనే రూ. 50. రూ. 200 నోట్ల చిత్రాలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యాయి.